ఆన్ లైన్ లోనే శ్రీశైలం ఆర్జిత సేవా టిక్కెట్లు

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనం భక్తులందరికి మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు శ్రీశైల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో జరిగే అన్ని ఆర్జితసేవ టికెట్లు శ్రీస్వామివారి స్పర్శదర్శనం (సర్వకాదు) టికెట్లు ఇక నుంచి ఆన్ లైన్ లోనే పొందాలని,  కరెంట్ బుకింగ్ కౌంటర్ల ద్వారా జారీ చేసే విధానం స్వస్తి పలుకుతామని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు.

అందుకుగాను ఏప్రిల్ 25వ తేదీ నుండి శ్రీశైల దేవస్థానం వెబ్ సైట్ లో టికెట్లు అందుబాటులో ఉంచి, మే 1వ తేదీ నుంచి భక్తులకు టికెట్లు ఆన్ లైన్ లో మాత్రమే జారీ చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే పర్వదినాలు, సెలవులలోనే కాకుండా సాధారణ రోజులలో కూడా శ్రీశైల క్షేత్రానికి భక్తులు అధికంగా వస్తుండడంతో సామాన్య భక్తులకు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం సౌకర్యవంతంగా కల్పించేందుకు ఆర్జితసేవా టికెట్లు, స్పర్శ దర్శనం టికెట్లు జారీ విషయంలో మార్పులు చేపట్టామని ఆలయ ఈవో లవన్న వెల్లడించారు.

సామాన్య భక్తుల దర్శనాలు అలానే ఆర్జితసేవ, స్పర్శ దర్శన భక్తులకు ఇబ్బందులు కలగకుండా విడతలవారీగా అన్ని అర్జితసేవలు జరిపించబడతాయని స్పష్టం చేశారు. ఆన్ లైన్ లో ఆర్జిత సేవా టికెట్లు, స్పర్శదర్శనం టికెట్లు పొందిన భక్తులకు టికెట్ పై సూచించిన సమయంలో మాత్రమే సేవ, దర్శనం అవకాశం కల్పించబదుతుందని తెలిపారు.

టికెట్లు పొందిన సేవకర్తలు, భక్తులు 15 నిమిషాల ముందు ప్రవేశద్వారం వద్ద రిపోర్ట్ చేయాలని చెప్పారు. అలాగే ఆన్ లైన్ లో టికెట్ పొందిన ప్రింట్ తో పాటు ఆధార్ కార్డు తప్పనిసరి అని, టికెట్టు స్కానింగ్ జరిపిన తర్వాతనే ఆలయ లోనికి అనుమతి ఇస్తామని ఈవో లవన్న చెప్పారు. భక్తులు ఈ విషయాలను మార్పులను గమనించుకొని దేవస్థానానికి సహకరించాలని భక్తులను ఈవో లవన్న కోరారు.