విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ ప్రకటించారు. విశాఖ పోర్టు కళావాణి స్టేడియంఓల నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో పాల్గొంటూ ప్రస్తుతానికి ప్లాంటును ప్రైవేటీకరించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని.. వీటిపై ఆర్‌ఎన్‌ఐఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మరింత సమయం వేచి ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు.
విశాఖ ఉక్కు కర్మాగారం వర్కింగ్ క్యాపిటల్ సమీకరణ కోసం ఆసక్తి వ్యక్తీకరణ కోసం బిడ్లను ఆహ్వానించిన వేళ బిడ్డింగ్ వ్యవహారంలో ఏపీలో అధికార వైసీపీ, బిఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో కేంద్ర మంత్రి ప్రకటన ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. కొత్త యూనిట్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు.
ప్రైవేటీకరణకు ముందు ఆర్‌ఎన్‌ఐఎల్‌ను బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు కేంద్రమంత్రి వివరించారు. స్టీల్ ప్లాంటుకు ప్రధాన సమస్యగా ఉన్న మైనింగ్, ఐరన్ ఓర్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫగ్గన్ తెలిపారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర మంత్రి కొట్టి పారేశారు. సింగరేణి ప్రతినిధులు స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళిక కోసం పర్యటిస్తున్న సమయంలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడులు పెట్టే విషయంలో బిఆర్‌ఎస్ పార్టీది రాజకీయ ఎత్తుగడ మాత్రమే అని ఆయన విమర్శించారు. మరోవైపు స్టీల్ ప్లాంట్‌ను కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై ప్లాంటు యాజమాన్యంతో మంత్రి చర్చించనున్నారు. ప్రధానంగా నిధుల సమీకరణతో పాటు మూడో బ్లాస్ట్ ఫర్నేస్ యూనిట్‌ను ప్రారంభించడానికి అవసరమైన వనరుల సమీకరణ స్టీల్ ప్లాంటు భవితవ్యాన్ని నిర్దేశించనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి ప్రతిపాదనలు ముందుకు తీసుకు వస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
880 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయని, పెట్టుబడుల ఉపసంహరణ తమ ప్రభుత్వ విధానమని కేంద్రం చెబుతున్న వేళ, కేంద్ర మంత్రి ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం మంత్రి ప్రకటించడం శుభపరిణామం అని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. రూ.5వేల కోట్ల మూల ధన సమీకరణకు కేంద్రం సహకరిస్తే కర్మాగారాన్ని గాడిన పెట్టొచ్చని చెబుతున్నారు.
ఎన్‌ఎండిసి నుంచి గనులను స్టీల్ ప్లాంటుకు కేటాయించి స్టీల్ ప్లాంట్ వివాదాన్ని ప్రస్తుతానికి ముగింపు పలికే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. బిఆర్‌ఎస్ రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తుండటంతో బీజేపీ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
More Stories
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సందేహాలపై కేంద్ర మంత్రి ఆగ్రహం
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం