బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బిజెపి పార్టీ లో చేరారు. గురువారం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు  జేపీ నడ్డా సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ తో సమావేశం అయ్యారు.   ఈ సందర్బంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మోదీ వల్ల తెలంగాణలో అరాచక పాలనకు అంతం వస్తుందని, మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం పని చేస్తానని తెలిపారు.  కేసీఆర్ అరాచక పాలన అంతం చేయటం బీజేపీకే సాధ్యమని, అందుకే తాను బీజేపీలో చేరానని తెలిపారు.
 
కొంతకాలం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి అడుగులు వేస్తున్నాయని, రెండు పార్టీలు కూడా కలిసికట్టుగా పని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అవినీతిపై పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ నిస్తేజంగా ఉందని ధ్వజమెత్తారు.  బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని కొందరు సీనియర్స్ అంటే,  పొత్తు లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారని అయితే స్పష్టత, నిబద్దత లేదని, అంతా గందరగోళంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారన, పార్టీ వాళ్లు వ్యాఖ్యలు చేస్తూ.. కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మన్‌‌గా ఉన్న మహేశ్వరరెడ్డి గత కొంత కాలం నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి దగ్గరవుతున్నారని మహేశ్వరరెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ రెండు రోజుల క్రితం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో తనకు నోటీస్‌ ఇచ్చే అధికారం టీపీసీసీకి లేదని స్పష్టం చేసిన మహేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గేను కలుస్తానని ఢిల్లీ వచ్చారు. అనంతరం జరిగిన పరిణామాలతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

మాజీ మంత్రి, బిజెపి ఎమ్యెల్యే ఈటల రాజేందర్ తో కలిసి గురువారం ఉదయం మహేశ్వర్ రెడ్డి తరుణ్‌ చుగ్‌ నివాసానికి చేరుకుని భేటీ అయ్యారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, తరుగ్ చుగ్ తో సమావేశం అనంతరం అక్కడి నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసి ఆయన సమక్షంలో పార్టీ లో చేరారు.

ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశం కంటే ముందే.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు.