మార్గదర్శిలో సోదాలు ఆపేలా ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు!

మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ సోదాలను ఆపేలా తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సీఐడీ చేస్తున్న సోదాలపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మార్గదర్శి ఏపీ సీఐడీ చేపట్టిన సోదాలు ఆపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. దీన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఎలాంటి పిటిషన్‌ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బెంచ్‌ ముందు ఈ ప్రస్తావన తీసుకు రావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
ఈ కేసులో ఇప్పటికే ఏ1గా ఉన్న రామోజీరావుతో పాటు ఏ2గా ఉన్న ఎండీ శైలజ కిరణ్ ను కూడా గత వారం విచారించింది. కీలక విషయాలను సేకరించిన సీఐడీ  ఏప్రిల్ 13న అమరావతిలోని సీఐడీ ఆఫీస్ కు విచారణకు రావాలని శైలజ కిరణ్ కు నోటీసులు కూడా జారీ చేసింది. గత గురువారం జూబ్లీహిల్స్‌లోని శైలజ కిరణ్‌ ఇంటిలో విచారించిన సీఐడి బృందం ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసింది.

చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి డిపాజిటర్ల సొమ్మును ఇతర సంస్థల్లోకి మళ్లించడం, అక్రమంగా డిపాజిట్లు సేకరించడం వంటి వ్యవహారాలపై సిఐడి దర్యాప్తు జరుపుతుంది. చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్‌, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఖాతాదారుల సొమ్మును డిపాజిట్లుగా సేకరించడంపై సిఐడి దర్యాప్తు చేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా సిఐడి జరిపిన సోదాల్లో నలుగురు మార్గదర్శి ఉద్యోగులను కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు మార్గదర్శి ఆడిట్ వ్యవహారాలు చూసిన బ్రహ్మయ్య అండ్ కో కంపెనీ ఆడిటర్ శ్రావణ్‌ను కూడా అరెస్ట్ చేసింది సీఐడీ.బ్యాలెన్స్ షీట్ నిర్వహించకపోవడంతో పాటు చిట్ గ్రూప్స్‌కు సంబంధించిన ఫారం 21ను కూడా మార్గదర్శి సంస్థ సమర్పించలేదని సిఐడి ఆరోపిస్తోంది.

మార్గదర్శి సంస్థపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 120బి, 477 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై విచారణకు హాజరు కావాలంటూ మార్గదర్శి ఎండీ, రామోజీ కోడలు చెరుకూరి శైలజకు ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే గత వారం ఆమెను సీఐడీ అధికారుల బృందం విచారించింది. ఇక ఈ కేసులోకి ఈడీ కూడా ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తున్నది.