ఆస్ట్రేలియాలో షాద్‌న‌గ‌ర్ వాసి అనుమానాస్ప‌ద మృతి

రంగారెడ్డి జిల్లా షాద్‌న‌గ‌ర్ వాసి అర‌టి అర‌వింద్ యాద‌వ్ (30) ఆస్ట్రేలియాలో అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి చెందాడు. షాద్‌న‌గ‌ర్ బీజేపీ నాయ‌కుడు అర‌టి కృష్ణ ఏకైక కుమారుడు అర‌వింద్  12ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లిన అరవింద్ యాదవ్ అక్కడే స్థిరపడ్డారు. ఏడాదిన్నర క్రితం షాద్‌నగర్‌కు చెందిన యువతితో అరవింద్ వివాహం జరిగింది.
 
ఐదు రోజుల క్రితం త‌న ఇంటి నుంచి వెళ్లిన అర‌వింద్ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ స‌భ్యులు ఆస్ట్రేలియా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే అర‌వింద్ మృతదేహం సముద్ర తీరంలో ల‌భ్య‌మైన‌ట్టు పోలీసులు గుర్తించారు. డీఎన్ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఆ మృత‌దేహం అర‌వింద్‌దేన‌ని పోలీసులు ధ్రువీక‌రించారు.
పెళ్లి తర్వాత అరవింద్ యాదవ్‌ తల్లి, భార్యతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు.
వారం రోజుల క్రితం అరవింద్ తల్లి ఉషారాణి అక్కడి వాతావరణం పడకపోవడంతో  షాద్ నగర్ తిరిగి వచ్చేశారు. అరవింద్ కుటుంబంతో కలిసి సోమవారం (మే 20న) ఇంటికి (షాద్ నగర్) వచ్చేందుకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నాడు.  గురువారం సాయంత్రం అరవింద్ మృతదేహాన్ని సముద్ర తీరంలో గుర్తించారు. అంతకు ముందు అరవింద్ కారును బీచ్‌ ఒడ్డున గుర్తించారు. అప్పటి నుంచి అరవింద్ అచూకీ కోసం గాలిస్తున్నారు. కుమారుడు మృతి చెందడంతో అరవింద్ తల్లి కన్నీరు మున్నీరవుతున్నారు.   

అర‌వింద్ భార్య గ‌ర్భిణి. కారు వాష్ చేయించుకుని వ‌స్తాన‌ని చెప్పిన అత‌డు తిరిగి ఇంటికి రాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. అరవింద్ తండ్రి కృష్ణ యాదవ్ 2006 ఏప్రిల్ 7న ఏలూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. 

కృష్ణ భార్య, అరవింద్ తల్లి ఉషారాణి షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. భర్త మరణం తర్వాత ఒక్కగానొక్క కుమారుడ్ని బాగా చదివించారు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం, ఆ తర్వాత పెళ్లి చేశారు. అరవింద్ జీవితంలో బాగా స్థిరపడ్డాడు అనుకుంటున్న సమయంలో ఇలా జరగడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తూ మృతిచెందాడా, స్నేహితులు పథకం ప్రకారం హత్య చేశారా అనేది తేలాల్సి ఉందని చెబుతున్నారు. అరవింద్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు సహకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.