రుణమాఫీ లేదు, బోనస్ లేదు..ఇదేనా ఇందిరమ్మ రాజ్యం!

రాష్ట్రంలో రుణమాఫీ లేదు, బోనస్ లేదు..ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండల పరిధిలోని రాఘవాపురం, రుద్రవెళ్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన గురువారం సందర్శించి పరిశీలించారు. 

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు విషయంలో మాయమాటలు చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతులపై భస్మాసుర హస్తం పెడుతోందని ధ్వజమెత్తారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస వసతులు కల్పించకపోవడం దారుణమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మంత్రులు, ఎంఎల్‌ఎలు తమ రాజకీయాలు చూసుకోవడమే తప్ప, కొనుగోలు కేంద్రాల దగ్గరకు వెళ్లి ఎందుకు పర్యవేక్షించడం లేదని ప్రశ్నించారు.  రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని మండిపడ్డారు. రైతులు రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్నా సిఎం రేవంత్ రెడ్డికి రాజకీయాలే ఎక్కువ అయ్యాయని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 

ధాన్యం కొనుగోలు చేయలేకపోతే గద్దె దిగిపోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. తక్షణమే వర్షానికి తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.