బయ్యారంపై కొత్త డ్రామాకు తెరలేపిన కేటీఆర్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో తమ ప్రభుత్వ  వైఫల్యం బయటపడి ప్రజలంతా చీదిరించుకుంటుండటంతో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రంపై బురద చల్లేందుకు బయ్యారంపై కొత్త డ్రామాకు తెరదీశారని బిజెపి నాయకులు మండిపడుతున్నారు.  సిర్పూర్ పేపర్ మిల్లు, ఆజంజాహి మిల్లు, రేయాన్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాని కేసీఆర్ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా  బిడ్డింగ్ దాఖలు చేస్తాననడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని ధ్వజమెత్తారు.
 
కేటీఆర్ కు మైండ్ దొబ్బింది. ఏం మాట్లాడుతున్నరో ఆయనకే అర్ధం కావడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ చెప్పారు.    గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అడిగితే తలాతోక లేకుండా బైలడిల్ల గనుల గురించి కేటీఆర్ మాట్లాడటం సిగ్గు చేటని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి దుయ్యబట్టారు. 
 
 రాష్ట్రంలో వాళ్లు తెరిపిస్తామన్న నిజాం షుగర్స్, రేయాన్స్, అజంజాహి, సిర్పూర్ కాగజ్ మిల్లులను తెరిపించడం చేతగాదు కానీ వైజాగ్ స్టీల్ లో వాటా పెడతామని బోగస్ మాటలు చెబుతావా? అంటూ  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నిస్తే తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కిందిది మీద, మీదది కింద అన్నట్లుగా బయ్యారం స్టీల్ అంశాన్ని కేంద్రంపైకి నెట్టే ప్రయత్నం చేసిండని అరుణ ఆరోపించారు.

ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఐరన్ ఓర్ లకు ఏపీలో ఉండే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి, తెలంగాణకు ఏం సంబంధం? అని ఆమె ప్రశ్నించారు. అదేదో ఈ రెండు లేకపోతే తెలంగాణలో తినడానికి అన్నమే దొరకదనట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నడని ఆమె ఎద్దేవా చేశారు.  ఒడిశా రాష్ట్రంలోని మైనింగ్ లో ఎవరు బిడ్డింగ్ వేశారో అంటూ మరి నిజంగా అక్కడ అవినీతి జరిగితే నవీన్ పట్నాయ్ ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది? అక్కడేమైనా బీజేపీ ప్రభుత్వం ఉందా? అని ఆమె నిలదీశారు.

నవీన్ పట్నాయక్ కు తెల్వని బైలడిల్ల మైనింగ్ కుంభకోణం కేటీఆర్ కు ఎట్లా తెలిసిందో ఆయనే సమాధానం చెప్పాలని అరుణ స్పష్టం చేశారు. తండ్రీకొడుకులకు గజకర్ణ గోకర్ణ విద్యలు బాగా తెలుసని అంటూ  ప్రజలను మాయ చేసేందుకు డ్రామాలాడటం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అని ఆమె ఎద్దేవా చేశారు. కానీ ప్రజలకు  తండ్రి కొడుకుల డ్రామాలన్నీ తెలిసిపోయినయ్. ఎవరూ వీరి మాటలు నమ్మే పరిస్థితిలో లేరని ఆమె స్పష్టం చేశారు.
 
కాగా, తెలంగాణలో మూతబడ్డ సంస్థలను పునరుద్ధరించడం చేతగాని కేటీఆర్  ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారిపై అభాండాలు మోపడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అని విజయశాంతి విమర్శించారు.  నరేంద్ర మోదీ గారి పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడుతున్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్దాలే అని ఆమె స్పష్టం చేశారు.
 
 ఫూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థను మినహా ఏ ప్రభుత్వ రంగ సంస్థను మోదీ పాలనలో ప్రైవేటుపరం చేశారో సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నించారు.  సంక్షోభంలో ఉన్న బీఎస్ఎన్ఎల్, హెచ్ఈఎల్ సంస్థలకు పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటించి ఆదుకున్న ప్రభుత్వం నరేంద్రమోదీగారిదే అని ఆమె గుర్తు చేశారు.

రామగుండంసహా మూతపడ్డ 5 ఎరువుల ఫ్యాక్టరీలను వేల కోట్లు ఖర్చు చేసి పునరుద్దరించి రైతులకు కొరత లేకుండా యూరియా సరఫరా చేస్తున్న ఘనత నరేంద్రమోదీగారి ప్రభుత్వానిదే కదా అని ఆమె చెప్పారు.

తండ్రీకొడుకులు ఎన్ని డ్రామాలు చేసినా  టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ పోరు ఆగదని, మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేసేవరకు ఉద్యమిస్తామని విజయశాంతి తేల్చి చెప్పారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా, నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా పోరాటాలను ఉధ్రుతం చేస్తామని స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈనెల 15న వరంగల్ లో జరపతలపెట్టిన ‘‘నిరుద్యోగ మార్చ్ ’’కు నిరుద్యోగులంతా తరలిరావాలని ఆమె పిలుపిచ్చారు.