
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ఓ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వేసిన ఓ పిటిషన్‌పై ఓ న్యాయవాది ముందస్తు విచారణ కోసం పట్టుబట్టగా ఆయన అసహనం వ్యక్తం చేశారు. తన అధికారాలను సవాల్ చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే సుప్రీంకోర్టు నిత్యం వివిధ బెంచ్‌ల ద్వారా సగటున వంద అత్యవసర కేసులను విచారణ కోసం జాబితా చేస్తున్నది.
ఈ క్రమంలో మంగళవారం సీజేఐ బెంచ్ ముందుకు ఓ న్యాయవాది కేసు వచ్చింది. ఈ కేసును ఈ నెల 17న విచారణ జరిపేందుకు సీజేఐ జాబితా చేశారు.
అయితే, సదరు న్యాయవాది అంతకన్నా ముందే విచారణ జరిపించాలని, మరో బెంచ్ ముందుకు పిటిషన్‌ను తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీజేఐని కోరారు. ఇందుకు ఆయన నిరాకరించారు. అయినా, పట్టుబట్టడంతో సీజేఐ ‘‘నా అధికారాల గురించి నాకు చెప్పవద్దు. నా విధులు నాకు తెలుసు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మీ కేసు విచారణ 17న లిస్ట్ అయ్యింది. ఇప్పుడు 14న విచారణ కోసం ఇంకో బెంచ్ ముందుకు వెళ్తామంటున్నారు. నా అధికారాలతో ఆడుకోవద్దు. ఈ ట్రిక్స్ నా వద్ద ప్లే చేయొద్దు. మీ కేసు విచారణ 17నే చేపడతాం’ అంటూ గట్టిగానే మందలించారు. దాంతో న్యాయవాది సీజేఐకి క్షమాపణలు చెప్పడంతో.. ‘మీ క్షమాపణలను అంగీకరిస్తున్నాం. నా అధికారాలను సవాల్ చేసేందుకు ప్రయత్నించకండి’ అంటూ సూచించారు.
గత నెలలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ వికాస్ సింగ్ పై కూడా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కూడా ఏ మాత్రం తగ్గకుండా, సీజేఐతో వాగ్వాదానికి దిగారు.
లాయర్స్ చాంబర్స్ కు భూమికి కేటాయించడానికి సంబంధించిన కేసు విచారణ విషయంలో వారిరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ కేసు విచారణ కోసం గత ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నామని, ఇకనైనా, కేసు విచారణకు తీసుకోనట్లైతే, ఈ అంశాన్ని న్యాయమూర్తి ఇంటి ముందుకు తీసుకువెళ్తామని న్యాయవాది వికాస్ సింగ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ముందు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీనిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఇదేనా పద్దతి అంటూ లాయర్ వికాస్ సింగ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ బెదిరింపులకు భయపడే వాడిని కాదు’’ అంటూ మండిపడ్డారు. “22 ఏళ్ల వృత్తి ప్రయాణంలో ఎవరికీ భయపడలేదు. బార్ సభ్యుడు కావచ్చు, వాద, ప్రతివాదులు కావచ్చు, ఎవరైనా సరే.. ఎవరికీ తలవంచలేదు. భవిష్యత్తులో కూడా అది జరగదు’’ అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
More Stories
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!