ట్రాఫిక్ సమస్య వస్తుందని కోర్టుకు సీఎం జగన్ గైరాజర్

తీవ్ర సంచలనం సృష్టించిన విశాఖ ఎయిర్‌పోర్టు కోడి కత్తి కేసులో ఎన్ఐఏ కోర్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తరపున సోమవారం రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. సీఎం జగన్‌కు వ్యక్తి గత హాజరు మినహాయింపు ఇచ్చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని లాయర్‌ వెంకటేశ్వర్లు పిటిషన్ దాఖలు చేశారు.

అలాగే ఈ కోడి కత్తి ఘటనలో కుట్ర కోణం దాగి ఉందని, దీనిపై ఎన్ఐఏ సమగ్ర విచారణ జరపాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. కోడి కత్తి శ్రీనుపై స్వగ్రామంలో 2017లో కేసు ఉందని న్యాయస్థానానికి లాయర్‌ వెంకటేశ్వర్లు తెలియజేశారు.  ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని గత వాయిదా సందర్భంగా మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కోర్టుకు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో తాజాగా జగన్ తరుపున లాయర్  అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందని, పేదలకు అందించే సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సి ఉందని పిటిషన్‌లో జగన్ పొందిపరిచారు.

అలాగే కోర్టుకు సీఎం హోదాలో హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతాయని పేర్కొన్నారు.  అందుకే అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి ఆయన సాక్ష్యంలో నమోదు చేయాలని పిటిషన్‌లో జగన్ కోర్టును అభ్యర్థించారు. లేదా వీడియో కాన్ఫరెన్స్, ఇతర మార్గాల ద్వారా సాక్ష్యం నమోదుకు వీలు కల్పించాలని కోరారు.

అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తును కూడా మరింత లోతుగా జరపాలంటూ మరో పిటిషన్ కూడా జగన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై గురువారం విచారణ జరుపుతామని ఎన్‌ఐఏ కోర్టు స్పష్టం చేసింది. 2018 అక్టోబరులో నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగింది. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు విచారణకు బాధితుడిగానే గాక సాక్షిగా ఉన్న జగన్ కూడా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.