విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో కేసీఆర్ పాల్గొనడంలో మతలబు!

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుప‌రం కాకుండా అడ్డుకునేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాల‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం వెనుక మతలబు ఏమిటనే ప్రశ్నలు రాజకీయ వర్గాలలో తలెత్తుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే నిజాం సుగర్స్ ను పునరుద్ధరిస్తామని వాగ్ధానాలు చేసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ ఊసెత్తడం లేదు.
 
అటువంటిది ఏకంగా వైజాగ్ స్టీల్ కొనుగోలు చేసి, నిర్వహిస్తామనడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జయేష్ రంజన్ నేతృత్వంలో ఈ విషయమై అధ్యయనం కోసం విశాఖకు అధికారుల బృందాన్ని పంపుతున్నారు. నిరుద్యోగ భృతి, రుణమాఫీ వంటి ఎన్నికల హామీలను నిధులు లేక అమలు చేయలేక పోతున్న కేసీఆర్, ప్రతినెలా ఎందటి తేదీకి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే ఇబ్బందులు పడుతున్నారు.
 
సింగరేణి సంస్థ ద్వారా విశాఖ ఉక్క పరిశ్రమను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15 వరకు బిడ్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. దీంతో ఆలోగా పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం బిడ్ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు దేశంలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ వేరే రాష్ట్రంలో బిడ్ దాఖలు చేయలేదు.
 
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయవద్దంటూ ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ వ్రాసిన పక్షం రోజుల లోపుగానే ఈ పరిణామం జరగడంతో దీని వెనుక బృహత్తర ప్రణాళిక ఉన్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీడ్ లో ప్లాంట్ నిర్వహణ దక్కినా అందుకు అవసరమైన ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడం రాష్ట్ర ప్రభుత్వంకు సాధ్యం కాదు.
 
అందుకనే, కొందరు ప్రైవేట్ భాగస్వాములను చేర్చుకోవడం ద్వారా బినామీ పేర్లతో మొత్తం స్టీల్ ప్లాన్ ను తమ కుటుంభంకు దక్కే విధంగా భారీ ప్రణాళిక ఉండిఉండొచ్చనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.  తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు తద్వారా ఉక్కును సమకూర్చుకోవాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
 
అయితే, ఉక్కు అవసరమైతే అందుబాటులో ఉండే మార్గాలు అన్వేషిస్తారు గాని ఏకంగా ఉక్కు ఫ్యాక్టరీని కొనుగోలు చేస్తారా? తెలంగాణ ప్రభుత్వంకు అంత ఆర్ధిక సామర్థ్యం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ముసుగులో బినామీ కంపెనీలకు ధారాదత్తం చేసే ప్రయత్నంగానే పలువురు భావిస్తున్నారు.