పోలవరం ముంపుపై సర్వే తర్వాతే పునరావాస నిధులు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఫేజ్‌-1 కింద 41.15 మీటర్లకుఎంత ముంపునకు గురవుతుంది, రెండో ఫేజ్‌లో 45.72 మీటర్ల ఎత్తుకు ఎంత ముంపునకు గురవుతుందో లిడార్‌ సర్వే నిర్వహించి సమగ్ర నివేదికను అందజేస్తే అప్పుడు పునరావాసానికి నిధులిస్తామని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.
 
సోమవారం ఆయన ఢిల్లీ నుంచి రాష్ట్ర జలవనరులశాఖ అధికారులతో పోలవరం ప్రాజెక్టుపై వర్చువల్‌గా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు జలవనరుల శాఖ ఇఎన్‌సి నారాయణరెడ్డి పోలవరం పనుల ప్రగతిపై వివరించారు. కీలకమైన స్పిల్‌వే పనులు, స్పిల్‌వే అప్రోచ్‌ కెనాల్‌ పనులతోపాటు కాఫర్‌ డ్యామ్‌ పనులను పూర్తి చేశామనితెలిపారు.
 
గోదావరి నదీ ప్రవాహానిు స్పిల్‌వే మీదుగా మళ్లించామని పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌తో వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రధాన డ్యామ్‌ నిర్మాణంలో తప్పిదాల వల్ల డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని వివరించారు. డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌, సిడబ్ల్యుసి ఆమోదించిన డిజైన్స్‌ మేరకురూ.2,022 కోట్లతో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ పనులను చేపట్టామని తెలిపారు.
 
పునరావాసానికి సంబంధించి మొదట ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ఎనిమిది మండలాల్లోని 373 గ్రామాల్లో 1.06 లక్షల కుటుంబాలకు పునరావాసం ఇవ్వాలని సర్వేలో తేలిందని పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన వరదలతో మరో 30 గ్రామాలు ముంపునకు గురవుతున్నట్లు గుర్తించామని వివరించారు. ఈ మేరకు సర్వే చేస్తామని తెలిపారు.
 
పునరావాసం పనులకు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేసేందుకు పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను ఆమోదించి, నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర జలవనరులశాఖ పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ తర్వాత పంకజ్‌ కుమార్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు న్యాయం చేసేందుకు ముంపు ప్రాంతాల్లో లిడార్‌ సర్వే చేయాలని ఆదేశించారు.
 
ఈ సర్వే ద్వారా 41.15 మీటర్లకు ఎన్ని నిధులు కావాలి, 45.72కు ఎంత కావాలో నివేదిక తయారు చేయాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కింద పునరావాసానికి కూడా కేంద్రం నిధులిస్తుందని తెలిపారు. మరో నాలుగు రోజుల్లో ఈ మేరకు పిపిఎ అధికారులతో సమావేశమవ్వాలని సూచించారు.