డిబార్‌ అయిన పదో తరగతి విద్యార్థికి హైకోర్టులో ఊరట

పదవ తరగతి హిందీ పరీక్ష పేపర్‌ లీకేజీకి కారణమయ్యాడన్న ఆరోపణలతో డిబార్‌ అయిన విద్యార్థి హరీష్‌కు ఊరట లభించింది. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో హిందీ పేపర్‌ లీక్‌ చేసిన ఆరోపణలతో హరీష్‌ అనే విద్యార్థిని ఐదేళ్ల పాటు అధికారులు డిబార్‌ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలకు అనుమతి ఇవ్వటం లేదు.
 
పరీక్షలకు అనుమతి ఇవ్వకపోటం, డిబార్ చేయటాన్ని సవాల్ చేస్తూ హరీష్ కుటుంబ సభ్యులు  హైకోర్టును ఆశ్రయించారు. తన కుమారుడు రీక్ష రాస్తున్న సమయంలో ఎవరో బలవంతంగా పేపర్‌ లాక్కున్నారని తెలిపారు. హిందీ పేపర్ లీక్ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో కూడా తమ కొడుకు పేరు ఎక్కడా లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
 
అయినా అధికారులు డిబార్ చేశారని, శుక్రవారం నాటి పరీక్షను రాసేందుకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును రాజకీయాలకు బలి చేశారని పిటిషన్ లో ప్రస్తావించారు. దీనిపై విచారించిన హైకోర్టు విద్యార్థికి ఊరటనిచ్చింది. హరీష్ మిగతా పరీక్షలు రాసేలా అనుమతివ్వాలని కోర్టు అధికారులను ఆదేశించింది.

పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సప్‌లో చక్కర్లు కొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పరీక్ష ప్రారంభమైన వెంటనే ప్రశ్నాపత్రాలు వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. ఇందుకు కారకుడిగా అతడిని ఐదేళ్ల పాటు డిబార్ చేశారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, తనను అయిదేళ్ల పాటు డిబార్‌ చేయడం అన్యాయమని విద్యార్థి బోరున విలపించాడు.

హిందీ ప్రశ్నపత్రాన్ని నిందితుడికి అందజేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హనుమకొండ కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థిపై విద్యాశాఖ అధికారులు వేటు వేశారు. గురువారం కమలాపూర్‌ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆంగ్ల పరీక్ష రాయడానికి వచ్చాడు.

పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్ధిని హనుమకొండ డీఈవో పిలిచి ‘నీ క్వశ్చన్‌ పేపర్‌ మూలంగా ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్‌ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష రాయవద్దంటూ బయటకు పంపారు. పరీక్ష కేంద్రం బయట తన హాల్‌టికెట్ తీసుకొని ఓ పత్రంపై సంతకం చేయించుకున్నారని విద్యార్థి విలపించాడు.

బుధవారం ‘పరీక్ష కేంద్రంలో మొదటి ఫ్లోర్‌లో మూడో నంబర్‌ గదిలో కిటికీ దగ్గర కూర్చుని హిందీ పరీక్ష రాస్తుంటే, గోడ మీది నుంచి వచ్చిన ఓ బాలుడు  ప్రశ్నపత్రం ఇవ్వాలని, బెదిరించాడని వివరించాడు. తాను ఇవ్వకపోయినా కిటికీ నుంచి లాక్కొని సెల్‌ ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నాడని తెలిపాడు.