ఎన్నికల ఏడాదిలో యుద్ద గుర్రాలుగా మారండి

 ‘‘ఎన్నికల ఏడాదిలో ఉన్నాం. మీరంతా యుద్దంలో పాల్గొనే గుర్రాల్లా మారాలి. ఇప్పుడు పెండ్లి ఊరేగింపు గుర్రాలతో పెద్దగా ప్రయోజనం ఉండదు.’’అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.  శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వివిధ మోర్చాల నాయకుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే నవంబర్ నుండి మే వరకు రివర్స్ ప్లాన్ లో కార్యక్రమాలను రూపొందించుకునేలా  రోడ్ మ్యాప్ రెడీ చేయాలని కోరారు.
 
అందులో భాగంగా 9,10,11 తేదీల్లో వివిధ మోర్చాలు సమావేశం కావాలని చెప్పారు. ఇకపై మోర్చాలు చేసే ప్రతి కార్యక్రమాన్ని సరళ్ యాప్ లో లోడ్ చేయాలని ఆయన సూచించారు.

కింది స్థాయి నుండి మోర్చాలను బలోపేతం చేసే దిశగా రోడ్ మ్యాప్ రూపొందించాలని రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశించారు.  నిరుద్యోగుల పక్షాన మే నాటికి అన్ని ఉమ్మడి జిల్లాల్లో భారీ ఎత్తున ’’నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తాం’’ అని తెలిపారు. అతి త్వరలో  10 వేల మందితో వరంగల్ జిల్లాలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యామని చెప్పారు.
 
కాగా, నిరుద్యోగ  మార్చ్ నిర్వహణ కమిటీని నియమించారు. ఈ కమిటీలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, బిజెపి మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి ఆకుల విజయ, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి  తూళ్ళ వీరేందర్ గౌడ్,  డాక్టర్ దరువు ఎల్లన్న, డాక్టర్ పుల్లారావు యాదవ్ ఉన్నారు.
ఇలా ఉండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సమాఖ్య స్పూర్తిని దెబ్బతీస్తూ ప్రధానమంత్రిని అవమానించడం దుర్మార్గమని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ మండిపడ్డారు. ఇలాంటి స్థితి ఏ రాష్ట్రంలోనూ లేదని, తెలంగాణ ప్రజలంతా ఆలోచించాలని కోరారు.  తెలంగాణ కోసం వేల కోట్ల రూపాయలను కేటాయించి అభివ్రుద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి  ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తే సీఎం రాకపోవడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. పైగా బీఆర్ఎస్ నేతలతో నిరసనలు చేయించి, కేంద్రానికి వ్యతిరేకంగా  ఫ్లెక్సీలు కట్టించడం దుర్మార్గమని మండిపడ్డారు.