కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిస్తాం

కుటుంబ పాలన నుంచి తెలంగాణకు ప్రజలకు విముక్తి కల్పిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో  కుటుంబ పాలనతో అవినీతిని పెంచి పోషిస్తున్నారని అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ప్రతి ప్రాజెక్టులోనూ తన కుటుంబ స్వార్ధం చూసుకుంటున్నారని చెబుతూ కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కావని స్పష్టం చేశారు.
 
తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్‌ ట్రైన్‌ను ప్రారంభించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. సభా వేదికగా రిమోట్ ద్వారా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.
 
 సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు జాతీయ రహదారుల నిర్మాణం, బీబీ నగర్ ఎయిమ్స్ భవన నిర్మాణం, మహబూబ్ నగర్- చించోలి మార్గాన్ని 2 ప్యాకేజీలుగా విస్తరణ, ఖమ్మం – దేవరపల్లి రహదారిని 4 వరుసలతో గ్రీన్‌పీల్డ్ కారిడార్‌గా నిర్మాణం, ఎంఎంటీఎస్ రెండో దశను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
 
అనంతరం సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ రాష్ట్రంలో ఇవాళ రూ. 11 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఇవాళ ఒకే రోజు 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించామని అంటూ దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చేశామని చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి ప్రాజెక్టులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని అంటూ ఈ సందర్భంగా ప్రధాని విమర్శలు గుప్పించారు.

“కేంద్రంతో తెలంగాణ కలిసి రావటం లేదు. అందుకే అభివృద్ధిలో ఆలస్యం జరుగుతోంది. మేం అభివృద్ధి చేస్తుంటే కొందరు సొంత లాభం చూసుకుంటున్నారు. నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి” అంటూ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. రాష్ట్ర సహకారం లేక తెలంగాణ ప్రజలే నష్టపోతున్నారని హెచ్చరించారు.

 
“ఈ ఏడాది మౌళిక వసతుల కోసం రూ. 10 లక్షల కోట్లు కేటాయించాం. రూ. 35 వేల కోట్లతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాం. రాష్ట్రంలో భారీ టెక్స్‌టైల్ పార్క్ నిర్మించనున్నాం” అని తెలిపారు. అయితే, రాష్ట్రంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం రాలేదని అంటూ పరోక్షంగా తన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనకపోవడంపై మండిపడ్డారు. అభివృద్ధి పనుల్లో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావట్లేదని విమర్శించారు.
 
“ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యం. కానీ కొందరు అడ్డుపడుతున్నారు. కుటుంబం, అవినీతిని పోషిస్తున్నారు. తెలంగాణలో కుటంబపాలనతో అవినీతి పెరిగింది. కొందరి గుప్పెట్లోనే అధికారం మగ్గుతోంది. నిజాయితీగా పని చేస్తుంటే వాళ్లకు గిట్టడం లేదు. అలాంటి వారికి సమాజ అభివృద్ధి పట్టడం. సొంత కుటుంబం ఎదిగితే చాలని అనుకుంటారు. ఇలాంటి వారితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి” అంటూ రాష్ట్ర ప్రజలను ప్రధాని హెచ్చరించారు.
 
 కుటుంబవాదంతో అవినీతిని పెంచుతున్నారని అంటూ  అభివృద్ధికి అడ్డుతగులుతున్నారని బిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
వారు విచారణ సంస్థలను బెదిరిస్తున్నారని మండిపడుతూ  అవినీతి పరుల విషయంలో చట్టం తనపని తాను చేసుకోవాలా ? వద్దా ?. అని ప్రశ్నించారు. అవినీతి పరులకు కోర్టుల్లోనూ చుక్కెదరువుతుందని ఎద్దేవా చేశారు.
 
ప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు చేపట్టామని తెలుపుతూ అవినీతిపరులకు నిజాయితీతో పని చేసే వారంటే భయం అని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. తెలంగాణలో ప్రజా వ్యతిరేకత మెుదలైందని చెబుతూ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కావాలని పిలుపిచ్చారు. తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పిస్తామని భరోసా ఇస్తూ  ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటమే తన లక్ష్యం అని స్పష్టం చేశారు.
 
“తెలంగాణ అభివృద్ధి కోసం మమ్మల్ని ఆశీర్వదించాలి. బీజేపీని ఆశీర్వదిస్తే.. తెలంగాణలో మరింత అభివృద్ధి” అని చెబుతూ తెలంగాణాలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు కలసి రావాలని రాష్ట్ర ప్రజలకు పిలుపిచ్చారు.