కోదండరాముని కల్యాణోత్సవాలకు జగన్ గైర్హాజరుపై ఆగ్రవేశాలు

ఒంటిమిట్టలో జరిగిన కోదండరాముడి కళ్యాణోత్సవాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలు బెణికినదని హాజరుకాకపోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఆ కార్యక్రమంపై దూరంగా ఉండటం కోసమే ఉద్దేశపూర్వకంగానే కాలు బెణికిందని సాకులు చెప్పారని ఆరోపణలు వెలువడుతున్నాయి.
 
దానితో ఏపీ సీఎం జగన్ ఫై హిందూసంఘాలు, పీఠాధిప‌తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. రాష్ట్రంలో జ‌రుగుతున్న హిందూ కార్యక్ర‌మాల‌కు ప్ర‌భుత్వాధినేత‌గా సీఎం హాజ‌రుకావ‌ల‌సి కార్య‌క్ర‌మాల‌కు ఏదో ఒక సాకు చెప్పి తప్పుకుంటున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ర‌కాల హిందూ ధార్మిక కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌భుత్వాధినేత‌లు స‌తీస‌మేతంగా హాజ‌రుకావ‌ల‌సి ఉంటుంద‌ని, కానీ, సీఎం జ‌గ‌న్ త‌న భార్య‌తో క‌లిసి ఎప్పుడైనా హిందూ ధార్మిక కార్యక్ర‌మాల‌కు హాజ‌రయ్యారా అని ప్ర‌శ్నిస్తున్నారు.
 
గతంలో కోర్టుకు ఖచ్చితంగా హాజరు కావాలని నోటీసులు వచ్చిన్నప్పుడు సహితం ఇదేవిధంగా కాలు బెణకడం గమనార్హం. కాలు బెణికిందని  చెబుతున్నా ఆయన తన కార్యాలయంలో అన్ని విధులకు హాజరవుతూ ఉన్నారు. 
 
కాలు నొప్పికారణంగా ఒంటిమిట్ట రామయ్య కళ్యాణానికి వెళ్లని ముఖ్యమంత్రి బుధవారం జరిగిన జగజ్జీవన్ రామ్ జయంతి, గురువారం పల్నాడులో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ ప్రారంభోత్సవాలకు ఎలా వెళ్లారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. రాముల వారి కల్యాణానికి ముఖ్యమంత్రి దంపతులు వెళ్లి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుండడంతో కాలు బెణికిందనే సాకుతో ముఖ్యమంత్రి ఒంటిమిట్టకు వెళ్లలేదని పలువురు భావిస్తున్నారు.
 
పెళ్లిళ్లకు, పేరంటాలకు సతీసమేతంగా హాజరయ్యే ముఖ్యమంత్రి హిందూ మత కార్యక్రమాలకు మాత్రం ఎందుకు దూరంగా ఉంటున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రామతీర్థంలో రాముడి తలను ధ్వంసం చేసినా వారిపై చర్యలు తీసుకోకపోవడం, అంతర్వేదిలో రథం తగులబెడితే తేనెటీగల వల్ల ప్రమాదం జరిగిందని కేసు మూసేయడం వాటిని ఘటనలను పరిశీలిస్తే హిందువుల మనోభావాల పట్ల ఏమాత్రం గౌరవం ప్రదర్శించటం లేదని స్పష్టం అవుతుంది.
 
నాలుగేళ్లలో 280 దేవాలయాలపై దాడులు జరిగిన్నట్లు చెబుతున్నా రాష్త్ర ప్రభుత్వం అయా ఘటనలపై సీరియస్ గా స్పందించి, తగు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. క్రైస్తవులు ఈస్టర్ కు ముందు వారం రోజులపాటు హోలీ వీక్ గా పాటిస్తుంటారు. ఆ రోజులలో ఎటువంటి ఉత్సవాలలో పాల్గొనరు. అందుకనే ముఖ్యమంత్రి ఒంటిమిట్ట వెళ్లలేకపోయారనే అభిప్రాయం కొందరిలో కలుగుతుంది.
కాగా, హిందూమత సంప్రదాయాలను గౌరవించడం, హిందూ దేవాలయాలకు వెళ్లడం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, ఆయన కుటుంబానికి ఏ మాత్రం ఇష్టం ఉండదని ఆంధ్రప్రదేశ్‌ సాధుపరిషత్తు అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురం ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు.
 
ఒంటిమిట్టకు వెళ్లకుండా జగన్ కుంటిసాకులు చెప్పారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.  కాలు బెణికింది అనేది ఓ సాకు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. సతీసమేతంగా వెళ్లాలి కాబట్టే జగన్ ఒంటిమిట్టకు వెళ్లలేదని అచ్చెన్న విమర్శించారు.