బీజేపీలో చేరిన కిరణ్‌కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా. లక్ష్మణ్ ల సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ సభ్యత్వాన్ని అరుణ్ సింగ్ అందించారు. కిరణ్ కుమార్ రెడ్డికి కండువా కప్పి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీలోకి ఆహ్వానించారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి చేరికతో ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, ముఖ్యమంత్రిగా కిరణ్‌ సేవలందించారని, కాంగ్రెస్‌లో ఆయన ఇన్నింగ్స్ ముగిసిందని.. బీజేపీలో చేరి కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్నారని ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రధాని చేసున్న కృషి కిరణ్ కుమార్ రెడ్డిని ఆకర్షించిందని చెబుతూ ప్రధాని నేతృత్వంలో పనిచేయాలని భావిస్తున్నట్లు కొన్ని నెలల ముందు తనకు తెలిపారని ప్రహ్లాద్ జోషి చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి కి క్లీన్ ఇమేజ్ ఉందని కొనియాడారు.

ఇక కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని తానెప్పుడూ అనుకోలేదని చెప్పారు. తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెస్  ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతోందని చెబుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్త్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ చెల్లాచెదురైందని పేర్కొన్నారు.

విభజనపై కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందని విమర్శించారు. నాయకత్వ లేమితో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోందని విమర్శించారు. బీజేపీ ఎదుగుతున్నా కొద్దీ కాంగ్రెస్ దిగజారుకుంటూ వచ్చిందని చెప్పారు. 1980లో 7.7శాతం ఉన్న బీజేపీ ఓటింగ్..2019లో 37 శాతానికి పైగా పెరిగిందని కిరణ్‌కుమార్‌రెడ్డి గుర్తు చేశారు.

తమది 1952 నుంచి కాంగ్రెస్ కుటుంబమని చెబుతూ  ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోలేదని, కాంగ్రెస్ హైకమాండ్‌కు అధికారం మాత్రమే కావాలని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. దేశాన్ని వృద్ధి చేయాలన్నది బీజేపీ లక్ష్యం బీజేపీయేనని అంటూ గెలవాలనే తపన, దూరదృష్టి బీజేపీలో మాత్రమే ఉందని స్పష్టం చేశారు. మోదీ, అమిత్‌షా డైరెక్షన్‌లో బీజేపీ దూసుకుపోతుందని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసించారు.

గత కొంత కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తిరిగి ఆయన క్రియాశీల రాజకీయాలలోకి రావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు కొద్దీరోజుల క్రితం రాజీనామా చేసి, ఇప్పుడు  బీజేపీలో చేరారు. ఆయన నాలుగు సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి (2010 నుంచి 2014 వరకు) 16వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను కూడా వ్యతిరేకించారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పేరుతో సొంతగా పార్టీ పెట్టారు. 2014 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఎన్నికలకు వెళ్లగా.. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమి ఎదురైంది.ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా ఎప్పుడూ కూడా క్రియాశీలకంగా లేరు.

ఇప్పుడు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన బీజేపీలో చేరినట్టు తెలుస్తోంది. మరోవైపు రాయలసీమలో తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు బీజేపీ సైతం ఆయనకు ఆహ్వానం పలికింది. కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. కిషోర్ కూడా గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉండగా.. 2019 ఎన్నికలకు ముందు తెలుగు దేశంలో చేరారు. ఆయన ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా.. పీలేరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు.