బండి సంజయ్‌కు కోర్టులో బెయిల్.. విడుదల

తీవ్ర ఉత్కంఠ.. సుదీర్ఘ, హోరాహోరీ వాదనల తర్వాత పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 14 రోజుల రిమాండ్‌లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌కు బెయిల్‌ మంజూరైంది. రూ.20 వేల పూచీకత్తుతోపాటు ఇద్దరి జమానతు సమర్పించాలని హనుమకొండ నాలుగో అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ఇన్‌చార్జి న్యాయమూర్తి రాపోలు అనిత తీర్పు వెలువరించారు.
 
దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, కేసు విచారణకు సహకరించాలని న్యాయమూర్తి షరతులు విధించారు. దానితో శుక్రవారం ఉదయం 9 గంటల తర్వాత కరీంనగర్ జైలు నుండి విడుదలయ్యారు. సంజయ్ కు సంఘీభావం తెలిపేందుకు భారీ ఎత్తున కార్యకర్తలు, నిరుద్యోగులు, విద్యార్థులు కరీంనగర్ కు తరలి వచ్చారు. జైలు పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ ఐదించి ఎక్కడికక్కడ కట్టడి చేశారు. 
అంతకు ముందు బెయిల్‌, కస్టడీ పిటిషన్లకు సంబంధించి గురువారం దాదాపు ఎనిమిది గంటలపాటు హోరాహోరీగా వాదనలు జరిగాయి. చివరికి, రాత్రి పది గంటలకు బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో సంజయ్‌ను ఏ1 నిందితుడిగా నమోదు చేయడం; కోర్టు 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే, పోలీసులు కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై కోర్టులో గురువారం వాదనలు జరిగాయి.
సంజయ్ తరఫున లాయర్లు కుట్ర కోణం ఆరోపణలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. టెన్త్​ హిందీ పేపర్ ఫొటో తీసి వాట్సప్​లో షేర్ చేసిన వ్యక్తితో సంజయ్​కు సంబంధం లేదని, అలాంటప్పుడు కుట్ర కోణం ఎలా ఉంటుందని ప్రశ్నించారు.  కరీంనగర్​లో నమోదైన కేసులో సంజయ్​ని ప్రివెంటివ్ కస్టడీకి తీసుకున్నారని, ఆ కస్టడీ నుంచి విడుదల చేయకుండానే మరో కేసులో అరెస్ట్ చేశారని తెలిపారు.
 
పేపర్ లీకేజీ, సంజయ్ అరెస్ట్ విషయంలో వరంగల్ సీపీ రంగనాథ్ మాటలు భిన్నంగా ఉన్నాయని సంజయ్ తరఫు లాయర్లు కోర్టు దృష్టికి తెచ్చారు.
‘‘ఈ నెల 4న ప్రెస్​మీట్​లో టెన్త్​ పేపర్ అంశం లీకేజీ కాదని చెప్పారు. ప్రశ్నపత్రం ఫొటో తీసిన వ్యక్తిని విచారించామని, పేపర్ బయటకు రావడంలో కుట్రలేదని సీపీ వెల్లడించారు. 5న జరిగిన ప్రెస్​మీట్​లో మాట మార్చారు. మొదటి రోజు కుట్ర కోణం లేదని చెప్పి, మరుసటిరోజు మాత్రం సంజయ్​పై కుట్ర కోణం ఆరోపణలు చేశారు” అని తెలిపారు.
 
ఈ మేరకు  సీపీ రంగనాథ్ ఆ రెండు తేదీల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లలో మాట్లాడిన వీడియోలను ప్లే చేసి జడ్జికి చూపించారు. ‘‘ఎంపీగా ఉన్న సంజయ్ అరెస్టులో పోలీసులు 41 సీఆర్పీసీ నిబంధనలను ఉల్లంఘించారు. ఎవరి నుంచి పేపర్లు లీక్ అయ్యాయో సాక్ష్యాలు కోర్టుకు సమర్పించలేదు. సంజయ్ అరెస్ట్, పేపర్ లీకేజీ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలి” అని కోరారు. ఈ నెల 8న ప్రధాని తెలంగాణకు రానున్నారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్​ని ప్రధాని పర్యటనకు దూరం చేయాలనే ఈ కేసులో ఇరికించారు” అని వాదించారు.
 
‘‘ఇటీవల సంజయ్ అత్తమ్మ మరణించారు.. శుక్రవారం ఆమె దశదిన కర్మకు సంజయ్​ హాజరుకావాల్సి ఉంది. బెయిల్ మంజూరు చేయాలి” అని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ కేసులో సంజయ్​తో పాటు బూరం ప్రశాంత్,  గుండెబోయిన మహేశ్​ను కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్​పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.