బిజెపికి అన్నింటికన్నా దేశమే ముఖ్యం

దేశంలో అవినీతిపైనా, వంశపారంపర్య రాజకీయాలపైనా పోరాడేందుకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని చెబుతూ బీజేపీకి అన్నిటి కన్నా దేశమే ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు.

అవినీతి, ఆశ్రిత పక్షపాతం, శాంతిభద్రతల సవాళ్ల నుంచి దేశాన్ని విముక్తి చేయడం కోసం బీజేపీ నిబద్ధతతో కృషి చేస్తోందని పేర్కొంటూ బీజేపీకి సర్వస్వం దేశమేనని ప్రధాని చెప్పారు. అవినీతిపైనా, వంశపారంపర్య రాజకీయాలపైనా పోరాడేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. సవాళ్లపై పోరాడే క్రమంలో హనుమంతుడిలా బీజేపీ కఠినంగా ఉంటుందని ప్రధాని మోదీ చెబుతూ తమకు అన్ని విషయాల కన్నా దేశ సంక్షేమమే ప్రథమమని స్పష్టం చేశారు.

“అవినీతి, బంధుప్రీతి, శాంతిభద్రతల సవాళ్ల నుంచి భారత దేశాన్ని విముక్తి చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు హనుమంతుడి లాంటి ధోరణిని బీజేపీ కొనసాగించగలదు. మేం కొన్నిసార్లు భగవాన్ హనుమాన్‍లా కఠినంగా ఉండగలం. కానీ కరుణ, వినమ్రతతో ముందుకు సాగుతాం. ఎప్పడూ దేశమే ప్రథమం అన్నది మా విధానం” అని ప్రధాని మోదీ వివరించారు.

రామభక్త హనుమంతుని మాదిరిగా భారతదేశం నేడు తన శక్తి, సామర్థ్యాలను తెలుసుకుంటోందని అంటూ అవినీతి, శాంతిభద్రతల సమస్యలపై పోరాడేందుకు బీజేపీ ఆంజనేయుడి నుంచి స్ఫూర్తిని, ప్రేరణను పొందుతోందని తెలిపారు. భక్తాంజనేయుడి జీవితాన్ని పరిశీలించినపుడు, ‘నేను చేయగలను’ అనే వైఖరితో ఆయన వ్యవహరించారని తెలుస్తుందని పేర్కొన్నారు.

అన్ని రకాలుగా ఆయన విజయం సాధించడానికి కారణం ఇదేనని అంటూ హనుమంతుడు ఏ పనినైనా చేయగలడని, ఆయన ఏ పనినైనా అందరి కోసం చేస్తాడని, తన కోసం తాను మాత్రం ఏదీ చేసుకోడని ప్రధాని గుర్తు చేశారు. హనుమంతుడు పాటించిన విలువలు, ఆయన బోధనల నుంచి బీజేపీ, దాని కార్యకర్తలు నిరంతరం ప్రేరణ పొందుతారని ఆయన చెప్పారు.

సముద్రమంతటి సవాళ్ళనైనా ఎదుర్కొనేంత బలంగా భారత దేశం ఎదిగిందని చెప్పారు. హనుమాన్ జయంతి సందర్భంగా అందరినీ దీవించాలని ఆయనను ప్రార్థిస్తున్నానని తెలిపారు.రాచరికపు ఆలోచనా ధోరణిగలవారు పేదలను, వెనుకబడిన వర్గాలవారిని, హక్కులను పొందలేనివారిని 2014 నుంచి అవమానిస్తున్నారని ప్రధాని ధ్వజమెత్తారు

దేశంలోని కాంగ్రెస్, ఇతర పార్టీలు తమ విధానం ఏంటో తెలియకుండానే బీజేపీపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయని, అందుకే వారి అడ్రస్ గల్లంతు అయ్యిందని ప్రధాని తెలిపారు. అయితే దేశం కోసం బీజేపీ పెద్ద పెద్ద కలలు కంటుందని, వాటిని సాకారం చేసి దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో నిలబట్టటం కోసం అకుంఠిత దీక్షతో పని చేస్తున్నామని చెప్పారు.

ప్రతిపక్ష పార్టీలు కుటుంబ, కులతత్వవాదులని దుయ్యబట్టారు. భారత దేశం సాధిస్తున్న అభివృద్ధిని తక్కువ చేసి చూపుతున్నారని తెలిపారు. పేదలకు చేస్తున్న సేవలను ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. అధికరణ 370 గత చరిత్ర అవుతుందని ప్రతిపక్షాలు ఎన్నడూ ఊహించలేదని మోదీ ఎద్దేవా చేశారు. బీజేపీ చేస్తున్న కృషిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని చెబుతూప్రతిపక్షాలు చాలా నిరాశతో ఉన్నాయని, ‘మోదీ! నీ సమాధి తవ్వబడుతుంది’ అనే స్థాయిలో ఆ నైరాశ్యం ఉందని చెప్పారు.

సామాజిక న్యాయం అనే నినాదాన్ని ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేవని విమర్శించారు. కానీ, బీజేపీ మాత్రం సాంఘిక, సామాజిక న్యాయం కోసం, అన్ని వర్గాలవారి ఉపాధి అవకాశాల కోసం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని చెప్పారు. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ సరుకులను అందజేస్తున్నామని, ఎటువంటి వివక్ష లేకుండా ఈ పథకం అమలవుతోందని ఆయన చెప్పారు.

కాంగ్రెస్‌ అంటే వంశపారంపర్యత, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అవినీతి అని మోదీ ఎద్దేవా చేశారు. బీజేపీ రాజకీయ సంస్కృతి అందరినీ కలుపుకొనిపోవడమని తెలిపారు. బీజేపీ భారత దేశం కోసం పగలు, రాత్రి అనే తేడా లేకుండా పని చేస్తోందని పేర్కొన్నారు. భారత మాతకు, రాజ్యాంగానికి, దేశానికి బీజేపీ అంకితమైందని చెప్పారు.

‘‘దేశానికే పెద్ద పీట అనే మంత్రాన్ని మా ధర్మసూత్రంగా పెట్టుకున్నాం. ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి నమ్మకం, అందరి కృషి’ అనే మంత్రంతో బీజేపీ పని చేస్తోంది’’ అని మోదీ చెప్పారు.