బిజెపిలో చేరిన ఎకె ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర రక్షణ మంత్రి ఎకె ఆంటోని కుమారుడు అనిల్ కె ఆంటోని గురువారం కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, వి మురళీధరన్ ల సమక్షంలో బిజెపిలో చేరారు. కేంద్ర మంత్రులు అనిల్ కె ఆంటొనీకి బీజేపీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత మురళీధరన్, అనిల్ ఆంటొనీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనిల్‌ ఆంటోనీని పార్టీలోకి ఆహ్వానించిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌  అనిల్‌ ఆంటోనీ బహుముఖ వ్యక్తిత్వం, ఆయన అర్హతలు ఎంతగానో ఆకట్టుకున్నాయని పొగిడారు. 

కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందిన డిజిటల్ మీడియా సెల్‌కు చైర్మన్‌గా వ్యహరించి ప్రధాని నరేంద్ర మోదీపై బిబిసి రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీపై కాంగ్రెస్ వైఖరిని తప్పుపట్టి జనవరిలో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అనిల్ ఆంటోని రాజీనామా చేశారు. ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ‘భారత్ పట్ల పక్షపాతం’ అని వాదించిన అనిల్ ఆంటోనీ నిషేధం ఉన్నప్పటికీ దాన్ని ప్రసారం చేయడం ద్వారా కాంగ్రెస్ భారత రాజకీయాల్లో ప్రతిపక్షాల ప్రతిష్టను దెబ్బతీస్తోందని ఆరోపించారు.

భారత్‌లో అంతర్గతంగా భేదాభిప్రాయాలు ఎన్ని ఉన్నా  విదేశ మీడియా కలుగజేసుకుని విభేదాలు సృష్టించేందుకు అవకాశం కల్పించరాదని ఈ సందర్భంగా అనిల్ కె ఆంటొనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల క్రితం జరిగినదానిపై ఇప్పుడు రగడ ఎందుకని ఆయన ప్రశ్నించారు. భారత్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఉందని చెప్పారు.

బిజెపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకత్వం ఒకే ఒక్క కుటుంబం కోసం పనిచేస్తోందే తప్ప యావద్దేశం కోసం కాదంటూ విమర్శించారు. ఇది వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాదని, భిన్నాభిప్రాయలు, భిన్న సిద్ధాంతాలకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. సరైన చర్యే తీసుకున్నానని తాను నమ్ముతున్నానని ఆయన చెప్పారు. అయితే, తన తండ్రి పట్ల గౌరవంలో ఎటువంటి మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

‘ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తాను ఒక కుటుంబం కోసం పనిచేస్తున్నానని నమ్ముతుంటాడు. కానీ నేను కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నానని అనుకున్నాను. ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం దేశ రాజకీయాలను అర్థం చేసుకోవడంలో వైఫల్యం చెందింది. ఇది నన్ను నిరాశపరిచింది’ అని అనిల్ ఆంటోని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచంలో భారత్‌ను అగ్రగామిగా నిలపాలన్న స్పష్టమైన దృక్పథం ప్రధాని మోదీకి ఉందని చెబుతూ భారతదేశం పట్ల ఆయనకున్న స్పష్టమైన దృక్పథం తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఈ కారణంగానే తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.