నా ప్రతిష్ట దిగజార్చేందుకు సుపారీ ఇచ్చారు

ఎలాగైనా తన ప్రతిష్ఠను దిగజార్చాలని కొందరు కంకణం కట్టుకున్నారని, ఇందుకు సుపారీ కూడా ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఈ విషయంలో తాము అనుకున్నది సాధించేందుకు వారు దేశంలో, దేశం బయటి వ్యక్తులతో చేతులు కలిపారని ఆయన తీవ్రమైన విమర్శ చేశారు.
 
భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌లో శనివారం భోపాల్‌-ఢిల్లీ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజల్లో విభజన తెచ్చి, ఓటు బ్యాంకుతో జనాలను ప్రసన్నం చేసుకునేందుకు పనిచేశాయని ధ్వజమెత్తారు. అయితే తాము ప్రజలను సంతృప్తిపరిచే పనులతో బిజీగా ఉన్నామని స్పష్టం చేశారు.
 
గత ప్రభుత్వాలు ఒక కుటుంబాన్ని దేశంలోనే తొలి కుటుంబంగా పరిగణించి నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలను విస్మరించాయని ప్రధాని  ఆరోపించారు. ‘‘గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాల్లో బిజీగా ఉండేవి. మిడిల్ క్లాస్, పేద ప్రజలను పట్టించుకునేవారు కాదు” అని మోదీ మండిపడ్డారు.
 
‘‘మేం మధ్య తరగతి, పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. ఇందుకు భారతీయ రైల్వేనే నిదర్శనం. సామాన్యులందరికీ అత్యాధునిక రైల్వే సౌలతులను అందుబాటులోకి తెచ్చాం” అని ప్రధాని తెలిపారు.  శనివారం ఏప్రిల్‌ ఒకటో తారీఖు అని, ప్రతి ఒక్కరినీ మోదీ ఏప్రిల్‌ ఫూల్‌ చేశారంటూ కాంగ్రెస్‌ మిత్రులు తనపై విమర్శలు చేస్తారని ఎద్దేవా చేశారు.
 
అయితే వందే భారత్‌ రైలు ఏప్రిల్‌ ఫస్టునే ప్రారంభమైందని, ఇది తమ ప్రభుత్వ నైపుణ్యం, సామర్థ్యం, ఆత్మ విశ్వాసానికి ప్రతీక అని ప్రధాని అభివర్ణించుకున్నారు. మన దేశంలో కొత్త అభివృద్ధికి వందే భారత్ రైళ్లు నిదర్శనమని మోదీ చెప్పారు. ఈ రైళ్లు సూపర్ సక్సెస్ అయ్యాయని, వీటికి  ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందని తెలిపారు.
 
వందే భారత్ రైళ్లతో కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయని, అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ‘‘మన దేశ రైల్వేను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు 9 ఏండ్లుగా కృషి చేస్తున్నాం. 900 స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. రైల్వే ప్రయాణం ఇప్పుడు సురక్షితంగా, పరిశుభ్రంగా మారింది” అని ప్రధాని వివరించారు.
 
గతంలో మధ్యప్రదేశ్ రైల్వేకు రూ.600 కోట్లే ఇవ్వగా, తాము రూ.13 వేల కోట్లు కేటాయించామని మోదీ తెలిపారు. కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ మంగు భాయ్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.  వందే భారత్‌ రైలును ప్రారంభించిన అనంతరం ఆయన ఆ రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా రైల్లో దాదాపు 300 మంది పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. భారతీయ రైల్వేపై నిర్వహించిన డ్రాయింగ్, వ్యాసరచన పోటీల ద్వారా విద్యార్థులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. 

కాగా, ఇది 11వ వందే భారత్ ట్రైన్. భోపాల్ నుంచి ఢిల్లీకి 708 కిలోమీటర్లు 7:45 గంటల్లో చేరుకుంటుంది. శనివారం మినహా అన్ని రోజుల్లో నడుస్తుంది. ఉదయం 5:40 గంటలకు రాణి కమలాపతి స్టేషన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:10 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:40 గంటలకు బయలుదేరుతుంది.