కాంగ్రెస్ ఫైల్స్ … కాంగ్రెస్ అవినీతిపై బీజేపీ వీడియో

ప్రతిపక్ష కాంగ్రెస్‍పై అధికార భారతీయ జనతా పార్టీ తాజాగా వీడియో దాడి మొదలుపెట్టింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో భారీ అవినీతి, కుంభకోణాలు జరిగాయంటూ ఆరోపిస్తూ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో సిరీస్‍కు కాంగ్రెస్ ఫైల్స్ అని పేరు పెట్టింది బీజేపీ.  2జీ కేసు నుంచి కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం వరకు ఆరోపణలను ఈ వీడియోలో ప్రస్తావించింది. 
కాంగ్రెస్ ఫైల్స్ అంటూ మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియో బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‍లో ఆదివారం పోస్ట్ అయింది.  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హయాం(2004-14)లో దేశంలో రూ.48,20,69,00,00,000 (రూ.4.80లక్షల కోట్లు) అవినీతి జరిగిందని ఆ వీడియోలో బీజేపీ ఆరోపించింది.
‘‘కాంగ్రెస్ ఫైల్స్‌లో మొదటి ఎపిసోడ్ ఇది. కాంగ్రెస్ పాలనలో ఒకదాని తర్వాత మరొక అవినీతి, కుంభకోణాలు ఎలా జరిగాయో చూడండి’’ అని బీజేపీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌తో ఓ వీడియోను జత చేసింది. ఈ వీడియో మెసేజ్‌కు ‘కాంగ్రెస్ అంటే అవినీతి’ అని తెలిపింది.
ఈ సొమ్ముతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఉండవచ్చునని చెప్పింది. దేశ భద్రత నుంచి అభివృద్ధి వరకు అనేక పథకాలను పూర్తి చేసి ఉండవచ్చునని తెలిపింది. 24 ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకలను, 300 రఫేల్ యుద్ధ విమానాలను కొనవచ్చునని, 1,000 మంగళ్ మిషన్స్‌‌ను నిర్వహించవచ్చునని తెలిపింది. కాంగ్రెస్ అవినీతి వల్ల పడిన భారాన్ని దేశం మోయవలసి వస్తోందని తెలిపింది. అభివృద్ధిలో దేశం వెనుకబడిందని పేర్కొంది.
యూపీఏ హయాంలో 2జీ స్పెక్ట్రమ్ స్కామ్, కోల్ స్కామ్, ఉపాధి హామీ పథకం కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో అవినితీ, ఇటలీతో హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు సహా మరిన్ని కుంభకోణాలు జరిగాయని బీజేపీ ఈ వీడియోలో ఆరోపించింది. రూ.1.86 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణం గురించి కూడా దీనిలో ప్రస్తావించింది. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోని చిట్ట చివరి పదేళ్లలో జరిగిన అవినీతిని వివరించింది.
వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో అగస్టావెస్ట్‌లాండ్ సీఈఓ రూ.350 కోట్లు ముడుపులు చెల్లించారని పేర్కొంది. టూజీ స్పెక్ట్రమ్ కుంభకోణం విలువ రూ.1.76 లక్షల కోట్లు అని తెలిపింది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కుంభకోణం జరిగిందని, కామన్వెల్త్ కుంభకోణం రూ.70 వేల కోట్లు అని, రైల్వే బోర్డు చైర్మన్‌కు ముడుపులు రూ.12 కోట్లు అని వివరించింది. కాంగ్రెస్ అవినీతిలో ఇది చాలా చిన్న భాగం మాత్రమేనని, సినిమా పూర్తి కాలేదని తెలిపింది. 
ఈ ‘కాంగ్రెస్ ఫైల్స్’ను సిరీస్‍లా కొనసాగించాలని బీజేపీ ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఆదివారం విడుదల చేసిన వీడియోను మొదటి ఎపిసోడ్‍గా పేర్కొంది. కాంగ్రెస్ అవినీతిపై ఇది ట్రైలర్ మాత్రమేనని, సినిమా ఇంకా పూర్తవలేదని బీజేపీ ఆ వీడియోలో పేర్కొంది. భ్రష్టాచారి బచావో అభియాన్ (అవినీతిని కాపాడే ఉద్యమం)ను ప్రతిపక్షాలు చేపట్టాయని ప్రధాని నరేంద్ర మోదీ గత వారం ఆరోపించడం తెలిసిందే. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ 14 ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రశ్నలు సంధించించినా, చర్యలు తీసుకున్నా ఏజెన్సీలను పార్టీలు టార్గెట్ చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. అవినీతిని కాపాడేందుకు కొన్ని పార్టీలు ఆందోళన చేస్తున్నాయని విమర్శించారు. మరోవైపు అదానీ గ్రూప్ అవకతవకలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ  కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అవినితీపై ఆరోపణలు చేస్తూ తాజా దాడిని బీజేపీ మొదలుపెట్టింది.