66.9 కోట్ల మంది డేటా చోరీ చేసిన కీలక వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ లో బయటపడ్డ డేటా చోరీ కేసు దేశంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 66.9 కోట్ల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 24 రాష్ట్రాల్లో 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీకి పాల్పడ్డ ఫరీదాబాద్‌కు చెందిన వినయ్‌ భరద్వాజ్‌ను ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

ఈ విధమైన మోసాలకు పాల్పడానికి భరద్వాజ్ 6 మెట్రోపాలిటిన్ సిటీల్లో 4.5 లక్షల ఉద్యోగాలను నియమించుకున్నాడు. నిందితుడి నుంచి 2 సెల్ ఫోన్లు,2 లాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది వివరాలను గుర్తించారు. నిందితుడి వద్ద ఉన్న కొన్ని ముఖ్యమైన డేటాలో రక్షణ సిబ్బంది డేటా కూడా ఉంది.

నిందితుడు విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగుల డేటాను అమ్మినట్లు సమాచారం. ‘ఇన్ స్పైర్ వెబ్’ అనే వెబ్ సైట్ ద్వారా పౌరుల డేటాను విక్రయించాడు. అవసరమైన వారికి ప్రజల వ్యక్తిగత డేటా అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. 104 విభాగాలకు చెందిన వ్యక్తులు, సంస్థల డేటా విక్రయించగా జీఎస్టీ, పాన్ కార్డు, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, ఇన్ స్టాగ్రామ్, బుక్ మై షో, బైజూస్, అప్ స్టాక్స్ వంటి సంస్థల  సహా మరికొన్ని సైట్ల డేటాను వీరు అమ్మేశారు.

ఆయా వ్యక్తుల ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు, అడ్రస్ లను విక్రయించారు.  వీటితో పాటు 9, 10, 11, 12 తరగతులు విద్యార్థులు డేటా, పాన్‌కార్డ్‌, క్రెడిట్‌కార్డ్‌, డెబిట్‌ కార్డ్‌, ఇన్సూరెన్స్‌, ఇన్‌కంట్యాక్స్‌, ఢిఫెన్స్‌ డేటా కూడా చోరికి గురైంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లోని “ఇన్‌స్పైర్‌వెబ్జ్” అనే వెబ్‌సైట్ ద్వారా ఆపరేట్ చేస్తున్న వినయ్ భరద్వాజ్ క్లౌడ్ డ్రైవ్ లింక్‌ల ద్వారా క్లయింట్‌లకు డేటాబేస్‌లను విక్రయిస్తున్నాడు.

బ్యాంకులు, బీమా, ఆర్థిక సేవలు, వైద్యులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ట్రూ-కాలర్, టెలికాం డేటా, ట్రేడింగ్, స్టాక్‌బ్రోకింగ్, కోట్లాది మంది వ్యక్తుల కన్సల్టింగ్ సేవలు మొదలైనవి. నీట్ విద్యార్థుల వారి పేర్లు, తండ్రి పేర్లతో కూడిన డేటా కొన్ని ముఖ్యమైన వర్గాలలో ఉన్నాయి. మొబైల్ నంబర్లు, వారి నివాసాలు కూడా ఈ నిందితుల వద్ద కనుగొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల పేరు, మొబైల్ నంబర్, కేటగిరీ, పుట్టిన తేదీ మొదలైన సమాచారంతో కూడిన డేటా కూడా కనుగొన్నారు.  అంతేకాకుండా, వాహనాల కారు యజమానుల డేటాబేస్, జాబ్ ఆస్పిరెంట్స్ డేటా, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ట్రావెల్ వివరాలు, ఎన్‌ఆర్‌ఐ డేటాబేస్ మొదలైనవాటిని కూడా గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు.

66.9 కోట్ల మంది డేటా చోరీకి గురవ్వగా, ఇందులో హైదరాబాదీలకు చెందిన కోటి మంది డేటా చోరీ అయ్యింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన రెండు కోట్ల 50 లక్షల మంది డేటా, మహారాష్ట్రకు చెందిన నాలుగు కోట్ల మంది డేటా చోరీ అయ్యిందని అధికారులు గుర్తించారు.

సైబరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చిన డేటా లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా దర్యాప్తులో భాగమయ్యాయి.  ముంబై, హైదరాబాద్, ఢిల్లీకి చెందిన ఉద్యోగులే సూత్రధారులుగా ఉన్నారు.  జస్ట్ డయల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల నుంచి డేటా చోరీ  అయినట్లుగా గుర్తించారు.

ఈ కేసులో ముందుగా.. 16.8 కోట్ల మంది వ్యక్తుల వ్యక్తిగత సమాచారం చోరీ అయినట్టు మొదట గుర్తించారు. అయితే.. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు జరపగా.. మొత్తం 66. 9 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం చోరీ అయినట్టు తేలింది.