నాల్గో పారిశ్రామిక విప్లవం టార్చ్ బేరర్‌గా ఉత్తరప్రదేశ్

నాల్గో పారిశ్రామిక విప్లవం టార్చ్ బేరర్‌గా ఉత్తరప్రదేశ్ ఉద్భవించనుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భరోసా వ్యక్తం చేశారు. `ఒక జిల్లా – ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) కార్యక్రమం ప్రతి జిల్లా ఉత్పత్తులను ప్రోత్సహించడమే  కాకుండా, ప్రపంచ మార్కెట్‌కు యాక్సెస్‌తో పాటు కొత్త డిజైన్‌ను కూడా అందిస్తోందని ఆయన చెప్పారు.
 
 శుక్రవారం లక్నోలోని లోక్ భవన్‌లో విశ్వకర్మ శ్రమ సమ్మాన్ యోజన కింద జరిగిన అవార్డు, టూల్‌కిట్ పంపిణీ కార్యక్రమంలో యోగి పాల్గొన్నారు. ఓడీఓపీ రాష్ట్రంలోని ఎంఎస్ఎంఇ రంగానికి వెన్నెముకగా మారిందని ఆయన తెలిపారు. ఇది మొత్తం దేశంలో స్వావలంబనకు నాంది పలికిందని చెప్పారు.

ఫిబ్రవరిలో లక్నోలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో అందుకున్న రూ. 35 లక్షల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను బట్టి ఇది స్పష్టమవుందని ఆయన తెలిపారు. “రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర బిందువు దాని 96 లక్షల ఎంఎస్ఎంఇలు (సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
 
ఎంఎస్ఎంఇ ఉత్పత్తులను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్రంలో డిజైనింగ్, ప్యాకేజింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు.  ఈ అవార్డు కార్యక్రమంలో పన్నెండు మందికి సంత్ కబీర్ స్టేట్ హ్యాండ్లూమ్ అవార్డు, 34 సంస్థలకు స్టేట్ ఎక్స్‌పోర్ట్ అవార్డు, 20 మందికి ఎంఎస్ఎంఇ లభించాయి.
 
విశ్వకర్మ శ్రమ సమ్మాన్ యోజన కింద శిక్షణ పొందిన 75,000 మంది కళాకారులకు టూల్‌కిట్‌లు, సర్టిఫికెట్లు అందించారు. ప్రపంచ స్థాయిలో రాష్ట్రంలోని హస్తకళాకారులకు  ఓడీఓపీ గౌరవాన్ని తెచ్చిపెట్టిందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.  ఉత్తరప్రదేశ్ నేడు ఎగుమతుల హబ్‌గా ఆవిర్భవించిందని ఆయన చెప్పారు. 2017కి ముందు ఎగుమతులు కేవలం రూ.86,000 కోట్లు మాత్రమేనని, ఇప్పుడు అది రూ.2.5 లక్షల కోట్లకు పెరిగిందని ముఖ్యమంత్రి యోగి తెలిపారు.
 
విశ్వకర్మ శ్రమ సమ్మాన్ యోజనతో బ్యాంకులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. తద్వారా చేతివృత్తిదారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఆర్థిక సహాయం పొందవచ్చని ఆయన చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బ్యాంకర్లతో విశ్వకర్మ శ్రమ సమ్మాన్ యోజనకు సంబంధించిన కళాకారుల సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.