ఆంక్షల కారణంగా బీహార్ లో అమిత్ షా కార్యక్రమం రద్దు

బీహార్‌ రోహ్తాస్‌ జిల్లాలోని సహస్రారామంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కార్యక్రమం రద్దయింది. ఈ మేరకు బీహార్‌ పోలీసులు శనివారం వెల్లడించారు. అయితే హోంమంత్రి పర్యటన 144 సెక్షన్‌ కారణంగా రద్దవ్వడం వల్ల ఆ రాష్ట్ర బిజెపి నేతలు పోలీసులపై, ప్రభుత్వంపై మండిపడ్డారు.

బిజెపి నేత సామ్రాట్‌ చౌదరి మాట్లాడుతూ.. ‘ఆ జిల్లాలో 144 సెక్షన్‌ను విధిస్తే మేము కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తాము’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమిత్ షా శని, ఆదివారాల్లో బిహర్‌లో పర్యటిస్తున్నారు. అశోక చక్రవర్తి జయంత్యుత్సవాల సందర్భంగా సాసారామ్‌‌లో జరిగే కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొనాల్సి ఉంది.

అయితే ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత, సెక్షన్ 144 అమలు నేపథ్యంలో ఆయన పర్యటనను బీజేపీ రద్దు చేసింది. నవాడాలో జరిగే బహిరంగ సభలో మాత్రం అమిత్ షా మాట్లాడతారని బిహార్ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి చెప్పారు.  హింసాత్మక సంఘటనలు జరగడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన విమర్శించారు. పరిస్థితిని అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డాయిరు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్రాన్ని సక్రమంగా నడపలేకపోతున్నారని ధ్వజమెత్తారు.

నితీశ్ సొంత జిల్లా బిహార్‌షరీఫ్‌లో హింసాత్మక సంఘటనలను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టినట్లు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. తాను తప్ప వేరొకరు సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని ఆయన ఓ సందేశాన్ని ఇచ్చారని మండిపడ్డారు. బిహార్ ప్రభుత్వం నిద్రపోతోందని అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ని ఇక్కడికి పంపించవలసి ఉంటుందని బిజెపి నేత హెచ్చరించారు.

కాగా, మార్చి 31వ తేదీన నలంద, సహస్రారాం జిల్లాలో రామనవమి పండుగ సందర్భంగా జరిగిన ఊరేగింపుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 14 మంది గాయపడటంతో, నలంద, సాసారామ్ ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాల్లో పరిస్థితి భయానకంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్‌ విధించింది.

నలంద జిల్లాలో 27 మంది, సమస్రారామం జిల్లాలో 18 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు బీహార్‌ పోలీసులు ఒక ట్వీట్‌లో తెలిపారు. ప్రస్తుతం ఈ జిల్లాల్లోని పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని, పూర్తిగా పోలీసుల అదుపులోనే ఉన్నట్లు నలంద జిల్లా సూపరిండింటెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అశోక్‌ మిశ్రా మీడియాకు వెల్లడించారు.

 ‘ఆ ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తున్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. 20 మందికిపైగా అరెస్టు చేశాము. ఈ ఘర్షణల్లో ఎనిమిది మంది గాయపడ్డారు. ముగ్గురికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. దయచేసి ప్రజలు వదంతులను నమ్మొద్దు. ప్రస్తుతం పరిస్థితి పోలీసుల కంట్రోలోనే ఉంది’ అని మిశ్రా తెలిపారు.

ఇదిలావుండగా, కేంద్ర మంత్రులు నిత్యానంద రాయ్, అశ్విని కుమార్ చౌబే శుక్రవారం సాసారామ్‌కు వెళ్లి, అక్కడి పరిస్థితిని సమీక్షించారు.