బెంగాల్ అల్లర్లపై గవర్నర్ కు అమిత్ షా ఫోన్

బెంగాల్ అల్లర్లపై గవర్నర్ కు అమిత్ షా ఫోన్

శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో గురువారం జరిగిన అల్లర్లు, హింసాకాండపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ లకు శుక్రవారం సాయంత్రం ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

హౌరాలో రెండు వర్గాల మధ్య గురువారం పెద్ద ఎత్తున ఘర్షణలు చేలరేగాయి. ఆందోళనకారులు వాహనాలను తగులబెడుతూ, రాళ్లు రువ్వుతూ, దుకాణాలను కొల్లగొడుతూ విధ్వంసం సృష్టించారు. పలు పోలీసు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఘర్షణలు చెలరేగిన ప్రాంతంలో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

ఈ నేపథ్యంలో అల్లర్లు జరిగిన ప్రాంతంలో గవర్నర్‌ పర్యటించనున్నారు. ఇదే సమయంలో అల్లర్లకు దారితీసిన కారణాలు, ప్రస్తుత పరిస్థితిని అమిత్‌షాకు గవర్నర్‌ ఫోనులో వివరించినట్టు తెలుస్తోంది. ఘర్షణలతో అట్టుడిగిన కాజిపరలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రంతా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు, సోదాలు చేపట్టారు.

ఇంతవరకూ 36 మందిని అరెస్టు చేశారు. పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ, షిబ్‌పూర్ ప్రాంతంలో శుక్రవారం తాజాగా మరో హింసాత్మక ఘటన వెలుగుచూసింది. ట్రాఫిక్ కోసం ఓ రోడ్డును తెరిచిన కొద్ది సేపటికే ఈ ఘటన జరిగింది. దీనిపై బీజేపీ, టీఎంసీ పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నాయి.

హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. శోభాయాత్ర సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించినట్టు ఆమె ఆరోపించారు.  కాగా, తాజా అల్లర్ల నేపథ్యంలో కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపాలని, ఎన్ఐఏ చేత దర్యాప్తు పశ్చిమబెంగాల్ బీజేపీ డిమాండ్ చేసింది.

బెంగాల్ హోమ్ మంత్రిగా ఈ అల్లర్లకు మమతా బెనర్జీయే బాధ్యురాలని బిజెపి ఐటి విభాగం కన్వీనర్ అమిత్ మాలవ్య స్పష్టం చేశారు. రామ నవమి నాడు నిరాహారదీక్ష చేపట్టి ఆమె హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారని విమర్శించారు. రంజాన్ కాబట్టి ముస్లిం ప్రాంతాలకు వెళ్లవద్దని ఆమె హిందువులకు చెబుతున్నారని, కానీ హిందువులు కూడా నవమి సందర్భంగా ఉపవాసంలో ఉన్నారని ఆమెకు తెలియదా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత సంవత్సరం ఘటన జరిగిన చోటే ఈ ఏడాది కూడా జరగడం పట్ల రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేత సువెందు అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ అల్లర్లకు తాను ఏ మతం వారిని నిందించబోనని, అయితే రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల వైఫల్యాన్ని ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు.