అమృత్ పాల్ సింగ్ ఓ పావు మాత్రమే .. అసలు సూత్రధారులు వేరే

శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

“80,000 మంది పోలీసు అధికారులు ఉన్నప్పటికీ, అమృతపాల్ సింగ్ ఎలా తప్పించుకున్నాడు?” అని ఆప్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ పై పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఖలిస్థాన్ అనుకూల నాయకుడు అమృతపాల్ సింగ్, అతని మద్దతుదారులపై రాష్ట్రవ్యాప్తంగా నిఘా ఉన్నప్పటికీ, భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం ‘వారిస్ దే పంజాబ్’ చీఫ్ ‌ను పట్టుకోవడంలో విఫలమైంది.

ఇంత పెద్ద ఎత్తున ఆపరేషన్ ప్లాన్ చేసినా కూడా, అమృతపాల్ ఎలా తప్పించుకున్నాడు? అని కూడా కోర్టు పంజాబ్ రాష్ట్ర పోలీస్ ని ప్రశ్నించింది. పోలీసుల కథనంపై అనుమానం వ్యక్తం చేసిన న్యాయస్థానం, అతన్ని తప్ప మిగిలిన అందరినీ అరెస్ట్ చేయడం ఎలా సాధ్యమైందని కూడా ప్రశ్నించింది. అతను ఇంత భద్రత మధ్య తప్పించుకున్నాడంటే, అది పూర్తిగా పంజాబ్ ఇంటెలిజెన్స్ వైఫల్యమే అని కోర్టు పేర్కొంది.
 
‘ఆనంద్‌పూర్ ఖల్సా ఫౌజ్’ పేరుతో అమృత్ పాల్ ఒక స్వంత ‘ప్రైవేట్ ఆర్మీ’ని నిర్మించుకున్నాడు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (కెటిఎఫ్) తరహాలోనే ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్ (ఎకేఎఫ్) పేరుతో ఆత్మాహుతి దాడులకు కూడా యువకులను సిద్ధం చేసి ఆయుధాలను నిల్వ చేసేందుకు అమృతపాల్ సింగ్ డ్రగ్స్ డి-అడిక్షన్ సెంటర్‌లను, గురుద్వారాలను ఉపయోగిస్తున్నట్లు ఆధారాలున్నాయి.
 
ఈ సైన్యం సహాయంతో, అమృతపాల్, అతని ఖలిస్తానీ మద్దతుదారులు, ఐఎస్ఐ ఆదేశానుసారం ఢిల్లీలో దాడులకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం వారు పాకిస్తాన్ నుంచి నిధులు కూడా పొందినట్లుగా ఆధారాలున్నాయ్. ఖలిస్తానీలకు అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున మద్దతుదారులు, సానుభూతిపరులు ఉన్నారు. వారిపై కూడా భారత్ కఠిన వైఖరి అవలంబిస్తోంది.
 
ఇంటా బయటా మనపై జరుగుతున్న కుట్రలను మనం ఎంత సమర్థవంతంగా ఎదుర్కుంటూ ఉన్నా, భారత్ ‌ను ఏదో విధంగా అస్థిరపరిచేందుకు అంతర్జాతీయ స్థాయిలో నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. జగ్మీత్ సింగ్ ఒక కెనడియన్ టిక్ టాకర్. ఇతను ఓ ఖలిస్తాన్ ఉగ్రవాద సానుభూతిపరుడు.
 
ఐఎస్ఐ ఏజెంట్ అమృతపాల్ సింగ్ కోసం భారత్ లో వేట ప్రారంభమైన వెంటనే, జగ్మీత్ సింగ్ ఖలిస్తానీ ఉగ్రవాదులకు అనుకూలంగా ట్విట్టర్ లో ప్రకటనలు ఇవ్వడం, ట్వీట్లు చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో అతను తన దేశం కెనడా, ట్రక్కర్ల నిరసనను ఎంత కఠినంగా అణచివేసిందో మరచిపోయాడు. అమృతపాల్ సింగ్ కోసం భారత్ లో పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన గాలింపు చర్యలను ప్రశ్నించటం ప్రారంభించాడు.
జగ్మీత్ ట్వీట్ల తర్వాత, భారత వ్యతిరేక టూల్‌కిట్ గ్యాంగ్ మొత్తం అవే ట్వీట్లను కాపీ చేసి వాటికి మరికొన్ని అబద్ధాలను కూడా జోడించి, వ్యాప్తిచెయ్యడం ప్రారంభించింది.  నిజానికి వీళ్ళ అసలు లక్ష్యం ఖలిస్తాన్ సాధన కూడా కాదు.  త్వరితగతిన అభివృద్ధి చెందుతూ, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రతిష్టను దిగజార్చడం, భారత్ ను ప్రపంచవ్యాప్తంగా కించపరచడం, తద్వారా భారత్ పురోగతిని అడ్డుకోవడం వాళ్ళ లక్ష్యం.
 
భారత్ వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేసే దేశమని, భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, భారత్ లో మైనారిటీలకు రక్షణ లేదని, భారత్ లో పేదరికం తాండవిస్తోందని, భారత్ లో దోపిడీ, హింస ఎక్కువని, ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు.

నిజానికి ఈ అమృతపాల్ అనే బిల్లిబిత్తిరి బుడంకాయ్ ప్రపంచవ్యాప్తంగా జరిగే అతి పెద్ద ఆటలో అరటిపండు మాత్రమే. నిజానికి వీళ్ళందరికీ, ఖలిస్తాన్‌ను భారతదేశం నుండి వేరు చేయడం సాధ్యం కాదని తెలుసు. ఈ ఆటకు సూత్రధారులు జగ్మీత్ సింగ్, తన్మన్జీత్ సింగ్ ధేసీ, రూపి కౌర్ వంటి పిరికివారు. వారు తమ ఎయిర్ కండిషన్డ్ కార్యాలయాలు, ఇళ్లలో కూర్చుని భారతదేశానికి విదేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేయబడిన ఉగ్రవాదులను నియంత్రిస్తుంటారు. భారత్ లో అమృత్ పాల్ చేసిన అరాచకానికి, ఆగడాలకు వీళ్ళే సూత్రధారులు.

జగ్మీత్ సింగ్ తర్వాత, యుకె  లేబర్ పార్టీ ఎంపీ, తన్మన్‌జీత్ సింగ్ ధేసీ, భారతదేశం పట్ల తనకున్న ద్వేషాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు. “పంజాబ్ రాష్ట్రంలో ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్ విధించడం గురించి భారతదేశం నుండి చాలా ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి. భారత్ లో సామూహిక అరెస్టులు జరుగుతున్నాయి. సమావేశాలపై ఆంక్షలు ఉన్నాయి. భారత్ లో ఉద్రిక్త పరిస్థితులు త్వరగా పరిష్కరింఛాలని, అందరి మానవ హక్కులూ గౌరవించబడాలని ప్రార్థిస్తున్నాను.” ఇదీ ఆయన ట్వీట్.

ఆయన ప్రకటనకు, జగ్మీత్ సింగ్ ట్వీట్ కు కొంచెం కూడా తేడా లేకపోవడం గమనార్హం. అలాగే ఇంగ్లాండ్ లోని లేబర్ పార్టీకి చెందిన షాడో విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ కూడా పంజాబ్ ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాడు. విచిత్రమేంటంటే వీళ్ళెవరికీ పంజబ్ లోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా అలజడులు సృష్టిస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాదులను పల్లెత్తు మాట అనడానికి కూడా నోరు రాలేదు.
ఈ ద్వేషపూరిత వ్యక్తుల ట్విట్టర్ ఖాతాలన్నిటినీ భారత్ ప్రభుత్వం నిలిపేసింది. జగ్మీత్ సింగ్ చేసిన ట్వీట్లు, రూపికౌర్ ట్వీట్లు, యునైటెడ్ ‌సిఖ్‌లు చేసిన ట్వీట్లు ఆన్నీ…. అన్నీ…. నిలిచిపోయాయి. అయితే వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఖలిస్తానీ ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. లండన్‌లోని భారత హైకమిషన్ పైన, తర్వాత భారత కాన్సులేట్ ‌పైన కూడా దాడి జరిగింది.
 
మరోవైపు మార్చి 15 – మార్చి 19 మధ్య కాలంలో, 2559 కొత్త ట్విట్టర్ ఖాతాలు తెరిచారు. వీటిలో ఎక్కువ భాగం కెనడా, అమెరికా, బ్రిటన్, పంజాబ్ ల‌లోనే ప్రారంభమయ్యాయ్. వాటిలో, మార్చి 17న, పారిపోయిన అమృతపాల్ సింగ్ ‌కు మద్దతుగా తెరిచిన ట్విట్టర్ ఖాతాలు 820.
 
దీన్నిబట్టి మనకు ఏమర్థమవుతుంది? భారత ప్రభుత్వం ఏవో కొన్ని ట్విట్టర్ ఖాతాలను స్తంభింప చేసినంత మాత్రాన సరిపోదు.  ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ నెట్వర్క్ ను చేదించాలంటే ప్రపంచంలోని అన్ని దేశాల సహకారం అవసరం. అందుకే భారత ప్రభుత్వం బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల సహకారాన్ని కోరడం మాత్రమే కాదు, వారిపై ఒత్తిడిని కూడా తీసుకురావాలి.
 
ఉదాహరణకు లండన్ లోని భారత్ హై కమిషన్ పై ఖలిస్థానీ తీవ్రవాదులు దాడికి తెగబడినప్పుడు, భారత జాతీయ జెండాని క్రిందికి లాగి, అవమానించి, అక్కడ ఖలిస్థానీ జెండాను ఎగుర వేయడానికి ప్రయత్నించినప్పుడు అక్కడి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అందుకు ప్రతిగా భారత్ మనదేశంలోని బ్రిటిష్ హై కమిషన్, బ్రిటిష్ కాన్సులేట్ ల దగ్గర సెక్యూరిటీ సిబ్బందిని తొలగించింది. అలాగే కెనడా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలను కూడా ఆయా దేశాలలో జరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలపై తీవ్రంగా హెచ్చరించింది.
ఈ ఖలిస్తానీ ఉద్యమం వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ హస్తం కూడా ఉంది. మొన్న పంజాబ్ లోని ఖలిస్తానీ ఉగ్రవాదులను వందల సంఖ్యలో అరెస్టు చేసి, అమృత్ పాల్ సింగ్ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు ప్రారంభించగానే ఏదో సాకుతో ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతు ఆందోళన మొదలైంది చూశారా?