కర్ణాటకలో సీఎం పదవికై కాంగ్రెస్ లో కుమ్ములాటలు షురూ!

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమీషన్ ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలలో గెలుపొందగలమనే మితిమీరిన ధీమాతో ముఖ్యమంత్రి పదవికి కుమ్ములాటలకు కీలక నేతలు దిగుతున్నారు. తాను ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నట్లు మాజీ ముఖ్యమంతిర్, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సిద్ధ‌రామ‌య్య తనకైతాను ప్రకటించి పార్టీలో కలకలం సృష్టించారు.
 
అయితే, సీఎం ప‌ద‌వికి త‌న‌తో పోటీ ప‌డుతున్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ‌కుమార్‌తో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని చెప్పుకొచ్చారు. తాను నూరు శాతం సీఎం అభ్య‌ర్ధినేన‌ని పేర్కొంటూఇప్పుడున్న ప‌రిస్ధితుల్లో త‌న‌తో పాటు డీకే శివ‌కుమార్ సీఎం ప‌ద‌వికి పోటీ ప‌డుతున్నార‌ని, అయితే జీ ప‌ర‌మేశ్వ‌ర కూడా సీఎం ప‌ద‌విని ఆశిస్తున్నాన‌ని గ‌తంలో ప్ర‌స్తావించార‌ని గుర్తు చేశారు.
 
మరోవంక, తాను అసెంబ్లీకి తిరిగి ఎట్లా ఎన్నిక కావాలో తెలియక తికమక పడుతున్నట్లు కనిపిస్తున్నది. ఎందుకైనా మంచిదని రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. మేలో జ‌రిగే క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను కోలార్‌తో పాటు వ‌రుణ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ పోటీ చేస్తాన‌ని సిద్ధ‌రామ‌య్య తెలిపారు.
 
అంటే, రాష్ట్రంలో బిజెపిని ఓడించడం అంత సులభం కాదని గ్రహించినట్లు స్పష్టం అవుతుంది. డీకే శివ‌కుమార్‌తో త‌న‌కు మెరుగైన సంబంధాలే ఉన్నాయ‌ని, ఎన్నిక‌లు ముగిసిన అనంత‌రం పార్టీ ఎమ్మెల్యేలు శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌ను ఎన్నుకుంటార‌ని చెప్పారు. సీఎం అభ్య‌ర్ధిని కాంగ్రెస్ ఎన్న‌డూ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించ‌లేద‌ని ఓ ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ సిద్ధ‌రామ‌య్య చెప్పారు.
 
ఒకవంక, ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించడం పార్టీ సంప్రదాయం కాదని అంటూనే తాను పోటీలో ఉన్నట్లు చెప్పుకోవడం పార్టీలో అంతర్గతంగా ఈ పదవికోసం కొనసాగుతున్న కుమ్ములాటలు వెల్లడి చేస్తుంది. పార్టీ అధిష్టానం సూచ‌ల‌న‌తో పాటు ఎమ్మెల్యేల అభీష్టం ప్ర‌కారం సీఎల్పీ నేత ఎంపిక ఉంటుంద‌ని చెప్పడం ద్వారా తనను సీఎంగా ఎంచుకోవాల్సిందే అన్నట్లు సంకేతం ఇచ్చారు.
 
ఇక ఇవే త‌న చివ‌రి ఎన్నిక‌ల‌ని సిద్ధ‌రామ‌య్య పునరుద్ఘాటించడం ద్వారా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. . వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డీకే శివకుమార్ సీఎం పదవి చేపట్టాలని అభిలషిస్తున్నారు. గడచిన ఐదేళ్లుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై నడిపిస్తున్న డీకేకు సిద్ధూ తాజా ప్రకటన గొంతులో వెలక్కాయ పడ్డ చందంగా తయారైంది.
 
 కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, కేసులను ఎదుర్కొంటూనే పార్టీ కోసం పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ ఆశీస్సులు ఆయనకే ఉన్నట్లు చెప్పుకొంటున్నారు.  ఇటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి అంశాన్ని ఇప్పుడు సిద్దరామయ్య ప్రస్తావించడం పార్టీ వర్గాలలో కలకలం రేపుతోంది. ఇక క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధులుగా త‌ల‌ప‌డ‌నున్నాయి.
 
అధికారం నిల‌బెట్టుకునేందుకు బిజెపి స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతుండ‌గా, బొమ్మై ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నది. మ‌రోవైపు గ‌ణ‌నీయ సంఖ్య‌లో సీట్లు ద‌క్కించుకుని కింగ్‌మేక‌ర్‌గా నిలిచేందుకు జేడీఎస్‌ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది.