రాహుల్‌ అనర్హతపై జర్మనీ స్పందన పట్ల భారత్ ఆగ్రహం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో ఎంపీగా ఆయన్ను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్ జారీచేయడం పట్ల జర్మనీ స్పందించిన తీరుపట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

జర్మనీ విదేశాంగ ప్రతినిధి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘భారత్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష, లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడం వంటి పరిణామాలను మేం నిశితంగా గమనిస్తున్నాం. మాకు తెలిసి.. రాహుల్‌ ఈ తీర్పుపై అప్పీల్‌ చేసుకునే స్థితిలో ఉన్నారు. అప్పుడే ఈ తీర్పు నిలబడుతుందా? ఏ ప్రాతిపదికన అతనిపై అనర్హత పడిందన్నది స్పష్టమవుతుంది’’ అని చెప్పారు.

ఈ కేసులో న్యాయ స్వతంత్రత ప్రమాణాలు, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని జర్మనీ ఆశిస్తున్నట్లు తెలిపారు. జర్మనీ స్పందనపై ధన్యవాదాలు చెబుతూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం ఉదయం ట్వీట్ చేశారు. ‘‘రాహుల్ గాంధీని బాధించడం ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎలా రాజీ పడుతోందో గుర్తించినందుకు జర్మనీ విదేశాంగ శాఖ, రిచర్డ్ వాకర్ కు ధన్యావాదాలు’’ అని పేర్కొన్నారు.

దీంతో కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. తమ దేశ అంతర్గత విషయాల్లో విదేశీ జోక్యాన్ని భారత్ సహించబోదని స్పష్టం చేశారు. ‘‘భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు విదేశీ శక్తులను ఆహ్వానించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. కాకపోతే ఒక్క విషయం గుర్తుంచుకోండి.. విదేశీ జోక్యాలతో భారతీయ న్యాయవ్యవస్థ ప్రభావితం కాబోదు. భారతదేశం ఇకపై ‘విదేశీ ప్రభావాన్ని’ సహించదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ’’ అని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.

రాహుల్‌కు పాట్నా కోర్టు సమన్లు

 కాగా, మోదీ  ఇంటి పేరుకు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపి సుశీల్ కుమార్ మోదీ  దాఖలు చేసిన పిటిషన్‌పై వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఏప్రిల్ 12న కోర్టులో హాజరుకావాలని ఆదేశిస్తూ పాట్నా ఎంపి-ఎమ్మెల్యే కోర్టు శుక్రవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది.
 
మోదీ ఇంటిపేరు ఉన్న ప్రజలను అవమానించే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై క్రిమినల్ డిఫమేషన్ కేసును సుశీల్ మోదీ  నమోదు చేశారు. దీనిపై కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ మోడీ ఇంటి పేరు గలవారందరూ దొంగలంటూ వ్యాఖ్యానించారు.