మే 10వ తేదీన కర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమరానికి తెరలేచింది. కర్ణాటక ఎలక్షన్ షెడ్యూల్‍ను భారత ఎన్నికల ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్  ఎన్నికల తేదీలను వెల్లడించారు. కర్ణాటకలోని మొత్తం 224 స్థానాలకు మే 10వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరగనుంది.
 
మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఏప్రిల్ 13వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది. ప్రాబల్యమున్న స్థానాల్లో సత్తాచాటి ప్రభుత్వ ఏర్పాటులో మళ్లీ కీలక పాత్ర పోషించాలని జేడీఎస్ లక్ష్యంగా పెట్టుకుంది.
 
ఏప్రిల్ 20వ తేదీ నామినేష‌న్ల‌కు చివ‌రి రోజు. ఏప్రిల్ 21న నామినేషన్లను పరిశీలిస్తారు. ఏప్రిల్ 24వ తేదీ అభ్య‌ర్థుల నామినేషన్‌ ఉపసంహరణకు చివ‌రి తేదీ అని ఎన్నిక‌ల కమీషన్ ప్ర‌క‌టించింది. కర్ణాటక ఎన్నికల్లో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయాల్సి ఉందని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. ఇందులో మహిళా ఓటర్లు 2.59 కోట్లు ఉన్నారని చెప్పారు. ఇక, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. తొలిసారి ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని సీఈసీ చెప్పారు.
 
ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అమ‌లులోకి రాక‌ముందే భారీ మొత్తంలో క‌ర్నాట‌క‌లో అక్ర‌మ డ‌బ్బును స్వాధీనం చేసుకున్న‌ట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇటీవ‌ల సుమారు రూ. 80 కోట్ల విలువైన డ‌బ్బు, వ‌స్తువుల‌ను సీజ్ చేసిన‌ట్లు తెలిపారు.  న‌గ‌దుతో పాటు చీర‌లు, కుక్క‌ర్లు, కిట్‌లు, హాట్ బాక్స్‌లు ఇత‌రు సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర స‌రిహ‌ద్దుల వ‌ద్ద చెక్‌పోస్టుల‌ను ప‌టిష్టం చేసిన‌ట్లు చెప్పారు. ఎథిక‌ల్ ఓటింగ్ కోసం క‌మ‌ర్షియ‌ల్ డిపార్ట్‌మెంట్ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.
 
2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్ కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్ చీఫ్ కుమార స్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. అయితే కొందరు రెబల్ ఎమ్మెల్యేను ఆకర్షించిన బీజేపీ 2019లో కాంగ్రెస్-జేడీఎస్ సర్కారును పడగొట్
 
అధికారం చేపట్టింది. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీకి 121 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‍కు 70, జేడీఎస్‍కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా, 2021లో ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను తొలగించిన బీజేపీ అధిష్టానం, బస్వరాజు బొమ్మైను సీఎంగా చేసింది. ప్రస్తుతం బొమ్మై సీఎంగా ఉన్నారు.
 
బిజెపికి దక్షిణాదిలో ఉన్న ఏకైక ప్రభుత్వం కావడంతో అధికారాన్ని కాపాడుకోవడం కోసం ప్రతిష్టాత్మకంగా కృషి చేస్తున్నది. కర్ణాటకపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ పెద్దలంతా దృష్టి సారించారు. ఇప్పటికే ఈ ఏడాది చాలాసార్లు మోదీ, అమిత్ షా కర్ణాటకలో పర్యటించారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. మాండ్యలో మెగా రోడ్ షో కూడా నిర్వహించారు