అధికార బిఆర్ఎస్ ఎమ్యెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్యపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు సద్దుమణిగేలోపుగానే అదే పార్టీకి చెందిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాసనసభ్యుడు దుర్గం చిన్నయ్య అటువంటి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధించినట్లు ఆరోపణలు చేస్తూ ఓ మహిళ వీడియోను కూడా విడుదల చేసింది.
తమపై తప్పుడు కేసులు పెట్టించాడని ఆమె ఆరోపించారు. కాగా ఎమ్మెల్యే వాట్సప్ చాట్, ఆడియో కూడా వైరల్ అయ్యింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ కు చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి గత యేడాది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓ డెయిరీని ప్రారంభించారు.
పక్కనే బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ నిర్మాణానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యే భూమి పూజ చేశారు. యూనిట్ కోసం ఎమ్మెల్యేనే రెండు ఎకరాల అసైన్డ్ భూమిని ఇప్పించారనే ప్రచారం కూడా జరిగింది. అయితే బర్రెల యూనిట్లు ఇప్పిస్తామని డెయిరీ నిర్వాహకులు తమ వద్ద నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని పలువురు పాడి రైతులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు డెయిరీ నిర్వాహకులను అరెస్టు చేసి జైలుకు కూడా పంపించారు. ఇదిలా ఉంటే ఇటీవల బెయిల్ పై విడుదలైన వారు ఎమ్మెల్యే తమను వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఆడియో, వీడియోలను విడుదల చేశారు. డబ్బులు అడిగితే ఇవ్వనందుకే ఎమ్మెల్యే చిన్నయ్య తమపై అక్రమంగా కేసులు పెట్టించాడని ఆరోపించారు.
తనను వేధింపులకు గురి చేశారంటూ డెయిరీ నిర్వాహకుల్లో ఒకరైన మహిళ ఆడియోను విడుదల చేసింది. డెయిరీ ఏర్పాటుకు సహకరించినందుకు వ్యాపారం తన సంబంధీకులకు వాటా ఇవ్వాలని, తన వద్దకు అమ్మాయిలను పంపించాలని, తన కోరికలు తీర్చాలని వేధించినట్లు ఆమె ఆరోపించారు.
వేధింపులు భరించలేక బ్రోకర్ ద్వారా ఎమ్మెల్యే వద్దకు అమ్మాయిలను కూడా పంపినట్లు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో, ఆడియో వైరల్ కావడం కలకలం రేపింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ తనకు వీటితో ఎలాంటి సంబంధం లేదని, తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు గిట్టిని వారు చేస్తున్న కుట్ర అని ఆరోపించారు.
ఏది ఏమైనప్పటికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఇలా ఆరోపణలు రావడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి మరి.
కాగా, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆరిజిన్ డెయిరీ నిర్వాహకుల గొడవలో పాడి రైతులు బలయ్యారు. బర్రెల యూనిట్కోసం రైతులు చెల్లించిన డబ్బులు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రైతులు కొంత కడితే మిగతా మొత్తం కంపెనీ లోన్ ద్వారా బర్రెలు ఇస్తామని చెప్పడంతో చాలామంది అప్పులు చేసి చెల్లించారు.
తీరా వారికి బర్రెల యూనిట్లు రాక, డెయిరీకి కట్టిన పైసలు రాక ఇబ్బందులు పడుతున్నారు. డెయిరీ ఫామ్ పెట్టుకుని ఎంతో కొంత బాగుపడుదామనుకుంటే ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చిందని వాపోతున్నారు.
ఆరిజిన్ డెయిరీకి ఇప్పటివరకు ఒక్క బల్క్మిల్క్ కూలింగ్ యూనిట్ (బీఎంసీయూ) కూడా లేదు. ఇంతవరకు లీటరు పాలను కూడా రైతుల దగ్గర నుంచి సేకరించింది లేదు. డెయిరీ నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులు సైతం లేవు. అయినప్పటికీ బెల్లంపల్లిలో డెయిరీ ఏర్పాటు వెనుక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కీలకంగా వ్యవహరించారు.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
దేశంలోనే సుసంపన్న రాష్ట్రం తెలంగాణ
కశ్మీర్లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి