అనారోగ్యంతో కన్నుమూసిన పుణే బిజెపి ఎంపీ

గత ఏడాదిన్నరగా అనారోగ్యంతో బాధపడుతున్నారు పుణే ఎంపీ..బిజెపి నేత గిరీశ్ బాపట్. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. గిరీశ్ బాపట్ అంత్యక్రియలు ఈ సాయంత్రం నిర్వహించనున్నారు.
 
ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రజాజీవనంలోకి వచ్చిన ఆయన పుణెలోని బిఎంసీసీ కాలేజీ అఫ్ కామర్స్ లో డిగ్రీ చదివారు.1980 నుండి బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పూనా నగర బిజెపి కార్యదర్శిగా పనిచేసిన ఆయన 1983లో జరిగిన ఉపఎన్నికలో పూణే మున్సిపల్ కార్పొరేషన్ కు కార్పొరేటర్ గా ఎన్నికై, వరుసగా మూడు సార్లు ఎన్నికయ్యారు.
 
1986-87లో పూణే మునిసిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం చైర్మన్ గా పనిచేశారు. 1997లో కృష్ణ వాలీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. 1995లో మొదటిసారి ఎమ్యెల్యేగా ఎన్నికైన గిరీశ్ బాపట్ గతంలో మహారాష్ట్రా మంత్రివర్గంలో ఆహారం, పౌరసరఫరాలు, పార్లమెంటరీ వ్యవహారాలు తదితర శాఖలను నిర్వహించారు. కస్బాపేట్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో మొదటిసారి లోక్ సభకు పోటీ చేసి పుణే నుంచి గెలుపొందారు.
 
ఎంపీ గిరీశ్ బాపట్ మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. గిరీశ్ బాపట్ సమాజం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి అని, నిరాడంబరమైన వ్యక్తి అని కీర్తించారు. కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న నేత అని కొనియాడారు. మహారాష్ట్ర అభివృద్ధి ఆయనకు ప్రాధాన్యతా అంశం అని, పుణే ఉన్నతస్థాయిలో ఉండాలని ఎంతో కృషి చేశారని వివరించారు.
 
మహారాష్ట్రలో బీజేపీని బలోపేతం చేసేందుకు నిర్మాణాత్మక సేవలు అందించారని, అటువంటి నేత అందరినీ విడిచి వెళ్లిపోవడం బాధాకరమని తెలిపారు. గిరీశ్ బాపట్ కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాపట్ మృతి పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎకనాథ్ షిండే సంతాపం వ్యక్తం చేస్తూ క్షేత్రస్థాయి రాజకీయ కార్యకర్తగా జీవనం ప్రారంభించి ఒక ఆదర్శ ప్రజా నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. గత నెలలోనే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పూణే పర్యటన సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి  పరామర్శించారు.

 
ఎన్సీపీ అధినేత శరద్ పవర్ బాపట్ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవనంలో ఎల్లప్పుడూ సమ్మిళిత విధానాలు ఆవలంభించారని కొనియాడారు. తాను ఓ గురువును, మార్గదర్శిని కోల్పోయానని బిజెపి సీనియర్ నేత,  రాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ చెప్పారు. ఆయన మృతి రాష్ట్రంలో బిజెపికి పూడ్చలేని నష్టం కలిగిస్తోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రశేఖర్ భవన్కులే తెలిపారు.