జమ్మూ కాశ్మీర్‌లో పెట్టుబడులకు అమిత్ షా పిలుపు

జమ్మూ కాశ్మీర్‌లో పాలసీ, శాంతిభద్రతలను చూసి పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టాలని మంగళవారం పరిశ్రమల బోర్డు అసోచామ్ వార్షిక సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపిచ్చారు.  కాశ్మీర్ లోయలోని అనుకూల పరిస్థితులను ఆయన ప్రస్తావిస్తూ 2014కు ముందు పరిస్థితులు భిన్నంగా ఉండేవని, మోదీ ప్రభుత్వం ఏర్పడగానే ప్రజల్లో నమ్మకం పెరిగిందని ఆర్థిక ప్రపంచ ప్రతినిధులతో పేర్కొన్నారు.

ఇండియా @ 100 పాత్ టు ఇన్‌క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్లోబల్ గ్రోత్ పేరుతో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా అందరం కలిసి నవ భారతాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన లక్ష్యంలో అందరికీ అవకాశం ఉందనిఎం కాబట్టి పరిమాణం, స్థాయి గురించి చింతించాల్సిన అవసరం లేదని అమిత్ షా భరోసా ఇచ్చారు. కశ్మీర్ లోయలో అనుకూల పరిస్థితుల గురించి హోంమంత్రి అమిత్ షా ప్రస్తావిస్తూ  ఇది స్వర్ణ కాలం అని ఆర్థిక ప్రపంచ ప్రతినిధులతో తెలిపారు.

“మీ మార్కెటింగ్, లాభదాయకత పరిస్థితులను బట్టి దేశంలో ఎక్కడైనా పెట్టుబడులకు ఎంచుకోండి. ఈ విషయంలో నేనేమీ సలహా యివ్వలేను. అయితే జమ్మూ కాశ్మీర్ లో అనుసరిస్తున్న విధానాలు, నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని మాత్రం చెప్పగలను. ఈ విషయం మీరు పరిగణలోకి తీసుకోండి” అని ఆయన సూచించారు.

నేడు భారత దేశం సాధిస్తున్న విజయాలను చూసి మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోతుందని పేర్కొంటూ గబ్బర్ సింగ్ టాక్స్ గా అవహేళన చేసిన జిఎస్టి నేడు కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు ఒక బృహత్తర అనుసంధానాన్ని ఏర్పాటు చేసినదాని అమిత్ షా తెలిపారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విద్యావిధానం కారణంగా మరో ఐదేళ్లలో అవసరమైన మానవ వనరులను కంపెనీలు మరెక్కడినుండో తీసుకు రావలసిన అవసరం ఉండబోదని స్పష్టం చేశారు.

మౌలిక సదుపాయాలతో దేశం సాధించిన అద్భుత విజయాలను గురించి ప్రస్తావిస్తూ 2014లో దేశంలో 6.1 కోట్ల మందికి మాత్రమే బ్రాడ్ బాడ్ కనెక్షన్లు ఉండగా, సెప్టెంబర్ 2022 నాటికి 82 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. లాజిస్టిక్ వ్యయాన్ని జీడీపీలో ప్రస్తుతం ఉన్న 13 శాతం నుండి 7.5 శాతంకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాలను పెంపొందించి, లోజిస్ట్ వ్యయాలను తగ్గించకుండా దేశం అభివృద్ధి చెందడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.

కరోనా సమయంలో మోదీ జనతా కర్ఫ్యూ ప్రకటించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తు చేశారు. ఎలాంటి నోటిఫికేష‌న్ లేకుండా ఇలా ఎలా జ‌రుగుతుందోన‌ని ఆందోళ‌న పడ్డారని, కానీ ఇంత జ‌రిగింద‌ని ఆ స‌మ‌యంలో ఆ నేత పిలుపుతో ప్రజల్లో ఇంట్లోనే ఉండిపోయారని చెప్పారు. ఇంతకు ముందు బడ్జెట్‌లో లోటు దాపురించిందని, గారడీ చేశామని, కానీ మోదీ ప్రభుత్వం పారదర్శకత తీసుకొచ్చిందని అమిత్ షా తెలిపారు. రాజకీయ సుస్థిరత కల్పించే పని మోదీ ప్రభుత్వం చేసిందని చెబుతూ గత 10 సంవత్సరాల కాలాన్ని రాజకీయ సుస్థిరత కాలం అంటారని స్పష్టం చేశారు.

కశ్మీర్‌లో ఉగ్రవాదం, నక్సలిజం, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రదాడులు అంతం కాబోతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం కొత్త విద్యావిధానం, ఆరోగ్య విధానం, డ్రోన్‌ విధానం, ప్రతి రంగంలోనూ కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రజలకు నచ్చని నిర్ణయాలను మోదీ ప్రభుత్వం ఎన్నడూ తీసుకోలేదని, ప్రజలకు మేలు జరగాల్సిన నిర్ణయాలను మాత్రమే తీసుకుందని అమిత్ షా తెలిపారు. 2025 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు.