ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్‌లపై పరువునష్టం కేసు

శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే వర్గం)అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రేలకు పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గం నేత రాహుల్‌ రమేశ్‌ షెవాలే కేసు వేశారు. ఈ క్రమంలో కోర్టు సమన్లు ఇచ్చింది.

అలాగే శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌కు సైతం కోర్టు సమన్లు పంపింది. ఈ కేసును ఏప్రిల్‌ 17న విచారించనున్నది. శివసేన అడిహకారిక పత్రిక  ‘సామ్నా’లో గతంలో రాహుల్‌ రమేశ్‌ షెవాలేపై కథనం ప్రచురించింది. కరాచీలో హోటల్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నట్లు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కథనం ప్రచురించి, తన ప్రతిష్టను దెబ్బతీశారని షెవాలే ఆరోపించారు.

ఈ మేరకు ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా ఉద్ధవ్‌ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్‌ రౌత్‌లకు సమన్లు జారీ చేసింది. ముగ్గురు నేతలతో పాటు గూగుల్‌, ట్విట్టర్‌కు సైతం నోటీసులు జారీ చేసిన కోర్టు 30రోజుల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తన ప్రతిష్టను కించపరిచేలా ఉన్న కథనాలను తొలగించాలని రాహుల్ రమేశ్‌ షెవాలే డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా,  రమేశ్‌పై లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. దుబాయిలో పనిచేస్తున్న ఫ్యాషన్ డిజైనర్ షెవాలే తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించింది.

పెళ్లి సాకుతో 2020 సంవత్సరం నుంచి షెవాలే లైంగికంగా వేధిస్తున్నారని సదరు మహిళ ఆరోపించింది. బాధితురాలు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు కూడా ఫిర్యాదు చేసింది. షెవాలే ముంబై సౌత్ సెంట్రల్ నుంచి ఎంపీ, నాలుగు సార్లు బీఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కొనసాగారు.