కిడ్నాప్ కేసులో మాజీ ఎంపీ అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు

ఉత్తరప్రదేశ్‌కు చెందిన పేరుమోసిన నేరగాడు, మాఫియా డాన్‌, సమాజ్‌వాది పార్టీ మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌కు జీవితఖైదు పడింది. ఉమేశ్‌పాల్‌ కిడ్నాప్‌ కేసులో ప్రయాగ్‌రాజ్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు శిక్ష విధించింది. అదేవిధంగా అతీక్‌ అహ్మద్‌కు రూ.5000 జరిమానా కూడా విధించింది. అతీక్‌ అహ్మద్‌తోపాటు దినేశ్‌ పాసి, ఖాన్ సౌలత్‌ హనీఫ్‌ను కూడా ప్రయాగ్ రాజ్ కోర్టు ఈ కేసులో దోషులుగా తేల్చింది. ఈ ముగ్గురూ తలా ఒక లక్ష రూపాయల చొప్పున ఉమేశ్‌ పాల్‌ కుటుంబానికి నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
 
 అయితే, ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఏడుగురిని సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషులుగా వదిలిపెట్టింది. నిర్దోషులుగా విడుదలైన వారిలో అతీక్‌ అహ్మద్‌ సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ కూడా ఉన్నాడు. అంతకు ముందు నైనీ కేంద్ర కారాగారం నుంచి భారీ భద్రత మధ్య నిందితులను కోర్టుకు తీసుకువచ్చారు.
 
 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్‌ఎల్‌ఎ రాజుపాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ ప్రధాన నిందితుడు. 2019 నుంచి సబర్మతి జైల్లో ఉన్నాడు. ఇతడిపై 100 కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే రాజు పాల్ హత్య కేసులో ముఖ్యసాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్ 2006లో అపహరణకు గురై విడుదలయ్యాడు.  2007లో అతడి అతీక్‌తోపాటు పలువురిపై కిడ్నాప్ కేసు నమోదు చేశాడు.
ఈ కేసు విచారణ చివరి రోజు (2023 ఫిబ్రవరి 24)నే అతడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అతీక్ అహ్మద్ పైనా కేసు నమోదైంది. ఈ క్రమంలోనే తాజాగా 2006 నాటి కిడ్నాప్ కేసులో కోర్టు అతీక్ అహ్మద్‌తోపాటు సౌలత్ హనీఫ్, దినేష్ పాసీలను దోషులుగా తేల్చింది.

కాగా, ప్రస్తుతం యూపీ పోలీసుల కస్టడీలో ఉన్న అతీక్ అహ్మద్  తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బెలా ఎం. త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.