రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కూతురు బాన్సురీ

దివంగత నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బాన్సురీ స్వరాజ్  ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీ  ఢిల్లీ లీగల్ సెల్ కో-కన్వీనర్‌గా ఆమె నియమితురాలయ్యారు.  ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా వీరేందర్ సచ్‍దేవా బాధ్యతలు చేపట్టాక, ఆయన చేసిన తొలి నియామకం ఇదే.

 లీగల్ సెల్ కో-కన్వీనర్‌గా బాన్సురీని ఆయన నియమించారు. ఆమె రాకతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులకు బాన్సురీ స్వరాజ్ ధన్యవాదాలు తెలిపారు. “భారతీయ జనతా పార్టీ ఢిల్లీ లీగల్ సెల్ కో-కన్వీనర్‌గా సేవలు అందించే అవకాశం ఇచ్చినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, వీరేందర్ సచ్‍దేవాకు ధన్యవాదాలు” అని ఆమె ఆదివారం ట్వీట్ చేశారు.

ప్రస్తుతం సుప్రీం కోర్టులో అడ్వకేట్‍గా బాన్సురీ స్వరాజ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఢిల్లీ బార్ కౌన్సిల్‍లో ఆమె 2007లో ఎన్రోల్ అయ్యారు. న్యాయవృత్తిలో ఆమెకు 16 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంగ్లిష్ లిటరేచర్‌లో వార్విక్ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పట్టా పొందారు బాన్సురీ స్వరాజ్.  ఆ తర్వాత లండన్‍లోని బీపీపీ లా స్కూల్‍లో లా పూర్తి చేశారు. బారిస్టర్‌గా ఆమె అర్హత సాధించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సెయింట్ క్యాథరీన్ కాలేజ్‍లో ఆమె మాస్టర్స్ పూర్తి చేశారుగతంలోనూ న్యాయపరమైన అంశాల్లో బీజేపీకి బాన్సురీ స్వరాజ్ సాయం చేశారు.

2014 నుంచి 2019 మధ్య విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా సుష్మా స్వరాజ్విధులు నిర్వర్తించారు. దశాబ్దాల పాటు బీజేపీకి సేవలు అందించారు. కెరీర్ ప్రారంభంలో ఆమె కూడా లాయర్‌గానే పని చేశారు. లీగల్ టీమ్ నుంచి బీజేపీలోకి 1975లో ఆమె అడుగుపెట్టారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి జాతీయస్థాయిలో ప్రధాన నాయకురాలు అయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగానూ పని చేశారు. ఎన్నో పదవులను చేపట్టారు. 2019 ఆగస్టులో గుండెపోటుతో సుష్మా స్వరాజ్ కన్నుమూశారు.

.