సావర్కర్ పై రాహుల్ వాఖ్యలపట్ల ఉద్ధవ్ ఆగ్రహం!

పరువు నష్టం కేసులో జైలు శిక్ష అనంతరం అనర్హత వేటు  పడటంతో తాను చేసిన వాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి తాను సావర్కర్ కాదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వాఖ్యలతో మహారాష్ట్రలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న కూటమి మనుగడకు ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన నాయకుడు ఉద్ధవ్ థాకరే ఆగ్రహం వ్యక్తం చేస్తూ సావర్కర్ ను కించపరచడం, కాంగ్రెస్ కూటమికి బీటలు పడేలా చేస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. వీడీ సావర్కర్ ను అవమానించవద్దని రాహుల్ గాంధీని ఆయన హెచ్చరించారు.

 హిందూ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ ను తాము ఆరాధ్య దైవంగా భావిస్తున్నామని, అవమానించడం మానుకోవాలని ఉద్ధవ్ థాకరే రాహుల్ గాంధీని కోరారు. సావర్కర్ 14 ఏళ్ల పాటు అండమాన్ సెల్యులర్ జైల్లో ఊహకందని చిత్రహింసలను అనుభవించాడని, అది త్యాగానికి ప్రతిరూపం అని, అటువంటి సావర్కర్ ను అవమానించడాన్ని తాము భరించమని ఆయన తేల్చి చెప్పారు.

ఇంతకు ముందు కూడా భారత్ జోడో యాత్ర సందర్భంగా సావర్కర్ గురించి రాహుల్ గాంధీ చేసిన వాఖ్యలతో తాము ఏకిభవించడం లేదని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు.సావర్కర్ విషయంలో పోరాటం చేయడానికి అయినా తమ సిద్ధంగా ఉన్నామని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాము కాంగ్రెస్, ఎన్సీపీల కూటమితో జత కట్టామని, ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఉద్ధవ్ థాకరే హితవు చెప్పారు. 

కావాలని కొందరు ఉద్దేశపూర్వకంగా రాహుల్ గాంధీని రెచ్చగొడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీకి మిత్రపక్షంగా ఉన్న శివసేన నాయకుడు ఉద్ధవ్ థాకరే రాహుల్ గాంధీని రెచ్చగొట్టవద్దని భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.