రెండో సారి ప్రపంచ ఛాంపియన్‌గా తెలంగాణ బాక్సర్ నిఖత్

మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ స్వర్ణాల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటికే రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్న భారత్ తాజాగా ఆదివారం మరో రెండు బంగారు పతాకాలను కైవసం చేసుకుంది. 50 కిలోల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ వరుసగా రెండో సంవత్సరం స్వర్ణాన్ని సొంతం చేసుకోగా, 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్‌ బంగారు పతకాన్ని సాధించింది.
 
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన  ఫైనల్‌లో వియాత్నాంకు చెందిన గుయెన్ తీ టామ్‌పై 5-0 తేడాతో విజయం సాధించింది. ఫలితంగా వరుసగా రెండోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. గతేడాది కూడా నిఖత్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలవడం గమనార్హం.
 
ఆది నుంచి నిఖత్‌ జరీన్ జోరు కొనసాగించింది. ప్రత్యర్థి ఎవరైనా స‌రే గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. క్వార్టర్స్‌ బౌట్‌లో నిఖత్‌ 5-2 తేడాతో చుతామత్‌ రక్సాత్‌(థాయ్‌లాండ్‌)పై అద్భుత విజయం సాధించింది. ఫైన‌ల్లో నిఖ‌త్‌, గుయెన్‌ థి టామ్‌పై పంచ్‌ల వ‌ర్షం కురిపించింది. ఆమె ధాటికి వియ‌త్నాం బాక్స‌ర్ చేతులెత్తేసింది.

నిఖత్ ఎటాకింగ్ గేమ్‌తో బౌట్‌ను ప్రారంభించింది. అయితే ప్రత్యర్థి గుయెన్ మాత్రం తన కూల్ గా ఆడినప్పటికీ తెలంగాణ బాక్సర్ మాత్రం ఎటాకింగ్ చేసింది. ప్రత్యర్థికి కాస్త దూరంగా ఉంటూ పంచుల వర్షాన్ని కురిపించిన నిఖత్ ఓపెనింగ్ రౌండులో ఆధిపత్యాన్ని చెలాయించింది. ఐదుగురు జడ్జీలు కూడా భారత బాక్సర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు.

ఇంక రెండో రౌండ్‌లో గుయెన్ తీ టామ్ అద్భుతంగా పుంజుకుంది. నిఖత్ డిఫెన్స్‌తో ఆ రౌండులో హోరాహోరీగా పోటీ పడింది. అయితే చివరకు ప్రత్యర్థి బాక్సర్ 3-2తో రెండో రౌండులో గెలిచింది. ఆఖరి రౌండులో బాక్సర్లిద్దరూ నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు.  కానీ నిఖత్ ప్రత్యర్థికి దూరాన్ని కొనసాగిస్తూ అఫెన్స్, డిఫెన్స్ ఇలా రెండింట్లోనూ సత్తా చాటి ప్రత్యర్థిని బోల్తా కొట్టించింది. చివరకు ఆధిక్యంలో దూసుకెళ్లి విజేతగా నిలిచింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌కు ఇది రెండో స్వర్ణం. గతేడాది 52 కేజీల విభాగంలో స్వర్ణాన్ని సాధించింది.

మరోవంక, 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్‌ బంగారు పతకాన్ని సాధించింది. ఇందులో కామన్వెల్త్‌ గేమ్స్‌ కాంస్య పతక విజేత, ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్‌ పార్కర్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో 5-2 తేడాతో మట్టికరిపించింది. మహిళ బాక్సింగ్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణ పతకం. దిగ్గజ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రెండో భారత బాక్సర్‌గా నిఖత్ చరిత్ర సృష్టించింది. గతేడాది 52 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన తెలంగాణ సంచలన ఈ ఏడాది 50 కేజీల విభాగంలో పసిడిని కైవసం చేసుకుంది.

శనివారం నాడు భారత్ రెండు స్వర్ణాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 48 కేజీల విభాగంలో నీతు గాంగాస్ 5-0 తేడాతో లుత్సాయిఖాన్‌ను(మంగోలియా) ఓడించగా, 81 కేజీల విభాగంలో స్వీటి 4-3 తేడాతో వాంగ్ లీనాపై (చైనా) నెగ్గింది.

వరుగా రెండోసారి బంగారు పతకం సాధించిన నిఖత్‌ జరీన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభినందించారు. ‘వియత్నాంకు చెందిన బాక్సర్‌ న్యూయెన్‌పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి భారత్‌కు మరోసారి గోల్డ్‌ మెడల్‌ సాధించి పెట్టిన నిఖత్‌ జరీన్‌ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తన వరుస విజయాలతో దేశఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందని కొనియాడారు.