మాఫియా రాజ్యం నుండి అభివృద్ధి వైపు ఉత్తర ప్రదేశ్

* యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఆరేళ్ళు
ఉత్తర్ ప్రదేశ్‌ అనగానే ఒకప్పుడు మాఫియా రాజ్యం గుర్తొచ్చేది. నేరస్థులు, దళారులు రాజ్యమేలుతుండేవారు. బంధుప్రీతి, అశ్రీతపక్షపాతంకు పాలనా యంత్రంగం నిలయంగా ఉండెడిది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరేళ్ళు పూర్తయింది. ఇప్పుడు అభివృద్ధికి,  శాంతిభద్రతలకు చిరునామాగా ఆ రాష్ట్రం మారింది.
 
 ఒకప్పుడు యూపీ అంటే అందరికీ మాఫియా గుర్తొచ్చేదని చెప్పిన ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇప్పుడు మహోత్సవాలకు కేరాఫ్ అడ్రస్‌గా రాష్ట్రం మారిందని చెప్పుకొచ్చారు.  ఒకప్పుడు గూండా రాజ్యం, మాఫియా రాజ్యం, మృగాళ్ల రాజ్యం, బంధుప్రీతితో కూడిన రాజకీయాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉండేవనే ప్రశ్న తలెత్తితే ఉత్త‌ర్ ప్రదేశ్ రాష్ట్రం పేరు అందరికీ ముందు గుర్తొచ్చేదని గుర్తు చేశారు.
 
 కానీ ఇప్పుడదంతా గతమని చెప్పారు. గత ప్రభుత్వాలు ఉత్తర్ ప్రదేశ్‌లో కుల మత రాజకీయాలను పెంచి పోషించాయని యోగీ మండిపడ్డారు. అంతేకాదు అవినీతి కూడా తారాస్థాయికి చేరిందని గుర్తుచేశారు. అదే సమయంలో తమ కుటుంబ సభ్యులు, బంధువులను మాత్రమే పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేశారని మండిపడ్డారు. సామాన్య ప్రజలను ఆ ప్రభుత్వాలు విస్మరించాయని విమర్శించారు.

 
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి యోగీ చెప్పుకొచ్చారు. పారిశ్రామికంగా ఉత్తర్ ప్రదేశ్ ఎంతో వృద్ధి చెందిందని చెప్పారు. 2018లో రాష్ట్రంకు రూ.4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు రూ.35 లక్షల కోట్లు పెట్టుబడులు యూపీకి రానున్నాయని వెల్లడించారు. ఫిబ్రవరిలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఈ మేరకు ఒప్పందాలు జరిగాయని గుర్తుచేశారు.
 
కేవలం ఐదేళ్లలో దాదాపుగా తొమ్మిది రెట్లు మేర పెట్టుబడులు పెరిగాయని పేర్కొంటూ  దేశంలో మరే రాష్ట్రంలో ఈ స్థాయిలో పెట్టుబడులు రాలేదని యోగీ స్పష్టం చేశారు.  ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో అభివృద్ధి పరుగులు తీయడంలో తన కేబినెట్ మంత్రులను ప్రభుత్వంలోని అధికారుల పనితాన్ని ప్రశంసించారు.
 
రెండో సారి తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంవత్సరంలోనే 10 ముఖ్యమైన రంగాలు గుర్తించి ఆ మేరకు ఒక ప్రణాళికతో పనిచేశారని యోగీ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం అడ్డుగా నిలుస్తోన్న 241 అంశాలను ఒక సీనియర్ అధికారి గుర్తించి వాటిని సరళీకృతం చేశారని చెప్పారు.

 
వారణాసి హల్దియా వాటర్‌వే ద్వారా తొలిసారిగా ఉత్తర్‌ ప్రదేశ్‌కు నేరుగా పోర్టు అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. 2017లో రాష్ట్రంలో రెండు ఎయిర్‌పోర్టులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య తొమ్మిదికి చేరిందని చెప్పారు. వెనకబడిన ప్రాంతాలైన బుందేల్‌ఖండ్, పూర్వాంచల్ ప్రాంతాలను కలుపుతూ ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం జరిగిందని, ఇక్కడే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటైందని చెప్పారు.
 
 తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తోందని చెబుతూ అందుకే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో దేశంలోనే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం తొలిస్థానంలో నిలిచిందని ఆదిత్యనాథ్ తెలిపారు.  రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకోసం ప్రధాన నగరాల్లో ఏడు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
 ఇక గ్యాంగ్స్‌టర్స్‌కు సంబంధించి రూ.2,819 కోట్ల విలువ చేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పిన యోగీ రాష్ట్రంలో గత ఆరేళ్లలో అత్యంత ప్రమాదకరమైన 175 మంది క్రిమినల్స్‌ను తమ ప్రభుత్వం ఏరిపారేసిందని తెలిపారు.