ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభంపై భారత్ అప్రమత్తం

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న బ్యాంకింగ్ సంక్షోభంపై భారత్ అప్రమత్తమైంది.  ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని బ్యాంకుల పనితీరును విశ్లేషించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ ప్రభుత్వ బ్యాంకుల ఎండీలు, సీఈఓలతో శనివారం సమావేశమయ్యారు. పెరిగిన వడ్డీ రేట్ల ప్రభావంపై బ్యాంకులు జాగ్రత్తగా ఉండాలని, డిపాజిట్లు, అసెట్లను డైవర్సిఫై  చేసుకోవాలని ఆమె సూచించారు.

రిస్క్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌పై ఎక్కువ  ఫోకస్ పెట్టాలని, ఇందుకోసం ఓ ఫ్రేమ్‌‌వర్క్‌‌ను రెడీ చేసుకోవాలని ఆమె కోరారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగ్వత్‌‌ కరాద్‌‌, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్‌‌ జోషి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

యూఎస్‌‌, యూరప్‌‌లోని బ్యాంకింగ్ క్రైసిస్  ప్రభావం దేశంలోని బ్యాంకులపై షార్ట్‌‌, లాంగ్‌‌ టెర్మ్‌‌లో ఎంతవరకు ఉంటుందనే అంశాలను ఈ మీటింగ్‌‌లో ముఖ్యంగా చర్చించారు.  ఎన్‌‌పీఏలుగా మారే లోన్లపైన దృష్టి పెట్టాలని, ఇతర  సమస్యలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంకుల నుంచి  బాండ్ ఫోర్టుపోలియో వివరాలను  ఈ సమావేశంపై ముందే ఆర్ధిక మంత్రిత్వ శాఖ తీసుకుంది.  

అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభం నుంచి  బ్యాంకులు తమను తాము రక్షించుకోవాలని సీతారామన్ సలహా ఇచ్చారు. అలానే గిఫ్ట్ సిటీలో తమ  బ్రాంచ్​లను ఓపెన్ చేసి, మరింత ప్రయోజనం పొందాలని  ఆమె సూచించారు. ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లో ప్రజలు రుణాలు తక్కువగా తీసుకుంటున్నారని, వారికి చేరువ కావాలని బ్యాంకులను ఆమె కోరారు. ఈ–నామ్, వన్ డిస్ట్రిక్ట్‌‌ వన్ ప్రొడక్ట్‌‌ వంటి సెగ్మెంట్‌‌లలో విస్తరించాలని సూచనలిచ్చారు.

బడ్జెట్‌‌లో ప్రకటించిన మహిళా సమ్మాన్​ బచత్‌‌ పత్రను ప్రమోట్‌‌ చేయాలని బ్యాంకులను సీతారామన్ అడిగారు.  ఇండికేటర్లన్నీ  ప్రభుత్వ బ్యాంకులు బలీయంగానే ఉన్నాయనే సంకేతాలిస్తున్నాయని ఆర్ధిక మంత్రిత్వశాఖ  ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా, అమెరికా బ్యాంకింగ్ సంక్షోభ  ప్రభావాన్ని భారతీయబ్యాంకులు  తట్టుకొని నిలబడగలవని ఎస్‌‌ అండ పీ గ్లోబల్‌‌ రేటింగ్స్  తెలిపింది. లిక్విడిటీ సమస్యలు తక్కువగా ఉండడం, సేవింగ్స్ రేట్ ఎక్కువగా ఉండడంతో దేశంలోని బ్యాంకులు నిలకడగా ఉన్నాయని వివరించింది. దేశంలోని బ్యాంకులు నిలకడగా ఉన్నాయని ప్రభుత్వం కూడా చెబుతోంది.

ప్రభుత్వ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.70,167 కోట్ల  నికర లాభాన్ని ప్రకటించాయి. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ మొత్తం రూ. లక్ష కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతేకాకుండా ఎన్‌‌పీఏల కోసం చేసే ప్రొవిజన్లు కూడా పెరిగాయి. ప్రభుత్వ బ్యాంకుల ప్రొవిజన్ కవరేజ్ రేషియో కిందటేడాది డిసెంబర్‌‌‌‌ నాటికి 46 శాతం నుంచి 89.9 శాతానికి పెరిగింది. ప్రభుత్వ బ్యాంకుల  క్యాపిటల్ అడెక్వసీ రేషియో డిసెంబర్, 2022 నాటికి 14.5 శాతంగా నమోదయ్యింది.

2015 మార్చి లో ఈ నెంబర్‌‌‌‌ 11.5 శాతంగా ఉంది.  అలానే ప్రభుత్వ బ్యాంకుల గ్రాస్ ఎన్‌‌పీఏల రేషియో 2018 లో 14.6 శాతానికి పెరగగా, డిసెంబర్‌‌‌‌, 2022 లో 5.53 శాతానికి దిగొచ్చింది. వీటి మార్కెట్ క్యాప్  రూ.10.63 లక్షల కోట్లకు చేరుకుంది. 2018 లో ప్రభుత్వ బ్యాంకుల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.52 లక్షల కోట్లుగా రికార్డయ్యింది.

ప్రభుత్వం ఫైనాన్షియల్ సెక్టార్‌‌‌‌లో  సమస్యలను గుర్తించడానికి వివిధ చర్యలు తీసుకుంటోంది. గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన బ్యాంకులు క్రమశిక్షణతో  అప్పులివ్వడం, బ్యాంకుల పనితీరు  మెరుగుపడింది. డిజిటల్ టెక్నాలజీ వాడకాన్ని పెంచడం, బ్యాంకుల విలీనం వంటివి ప్రభుత్వ బ్యాంకుల గ్రోత్‌‌కు సాయపడ్డాయి.