నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం – 3 రాకెట్

అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రరయోగించిన  ‘ఎల్ వీఎం 3’ రాకెట్ విజయవతంగా గగనంలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటనుంచి రాకెట్‌ను ప్రయోగించింది ఇస్రో.
 
ఈ ప్రయోగం ద్వారా యూకేకు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేట్‌ లిమిటెడ్‌ కంపెనీ, భారత్‌కు చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్‌ సంయుక్తంగా వన్‌వెబ్‌ ఇండియా–2 పేరుతో రూపొందించిన 5,805 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో 87.4 డిగ్రీల వంపులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
24.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఎల్‌వీఎం- 3 వాహకనౌక ద్వారా వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్దేశిత లియో ఎర్త్ ఆర్బిట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం తర్వాత 19.7 నిమిషాల్లో మూడు దశలను విజయవంతంగా పూర్తిచేసిన ఎల్‌వీఎం-3 నౌక నిర్దేశిత కక్ష్యలోకి 36 ఉపగ్రహాలను చేర్చింది. భూమి నుంచి 450 కిలోమీటర్ల దూరంలోకి కక్ష్యలోకి చేరిన తర్వాత.. ఉపగ్రహాలు ఒక్కొక్కటిగా విడిపోవడం ప్రారంభించాయి. ఈ ప్రక్రియ దాదాపు గంటన్నర కొనసాగుతుంది.
శనివారం ఉదయం 8.30 గంటల నుంచి నిర్విఘ్నంగా కౌంట్ డౌన్ సాగింది. ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు నిర్విఘ్నంగా పూర్తి చేశారు.  ఎల్వీఎం-3 ఎం-3 రాకేట్ ఎత్తు 43.5 మీటర్లు. బరువు 643 టన్నులు. 36 ఉపగ్రహాల బరువు 5805 కిలోలు. షార్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే నిన్నటి నుంచి ఇస్రో వర్గాలు, శాస్త్రవేత్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్‌వెబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందులో భాగంగా మొదటి దశలో 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబర్‌ 23న జిఎస్‌ఎల్‌వి-మార్క్‌ 3 రాకెట్‌ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

తాజాగా మరో 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపించనుంది. 20 నిమిషాల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన అనంతరం రాకెట్‌లో ఉంచిన 36 ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి పంపనున్నారు. వెంటనే ఆ ఉపగ్రహాలను యూకేలోని గ్రౌండ్‌ స్టేషన్‌ నుంచి తమ ఆధీనంలోకి తీసుకుని నియంత్రించనున్నారు.

జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ అయిన లాంచ్ వెహికల్ మార్క్-3 ద్వారా ఈ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఎల్‌వీఎం-3 ద్వారా ఇస్రో చేపట్టిన రెండో వాణిజ్య ప్రయోగం ఇది. ఎల్‌ఎంవీ 3 రాకెట్‌ సుమారు నాలుగు టన్నుల బరువైన ఉపగ్రహాలను జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ వరకు మోసుకెళ్లగలదు. జియోసింక్రనస్ ఆర్బిట్ భూ మధ్య రేఖకు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది.