నిస్సిగ్గుగా కాంగ్రెస్ సత్యాగ్రహం … బిజెపి ఎద్దేవా

దోషిని చేసి, లోక్‌సభ నుంచి అనర్హుడిగా వేటువేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆదివారం సంకల్ప సత్యాగ్రహం నిర్వహించడాన్ని బీజేపీ ఎద్దేవా చేసింది. దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా నిస్సిగ్గుగా ఈ సత్యాగ్రహం చేస్తోందని దుయ్యబట్టింది.
 
 కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశంలోని యావత్తు వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ సమర్థిస్తోందని మండిపడింది. మోదీ అనే ఇంటి పేరు కలవారిని రాహుల్ అవమానించారంటూ దాఖలైన పిటిషన్‌‌పై విచారణ జరిపిన గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
 
దీంతో ఆయనను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా పార్లమెంటు సచివాలయం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ సంకల్ప సత్యాగ్రహం చేస్తోంది.బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ చేస్తున్న సంకల్ప సత్యాగ్రహం మహాత్మా గాంధీకి అవమానకరమని చెప్పారు.
 
జాతిపిత గాంధీ సామాజిక సమస్యల కోసం సత్యాగ్రహాన్ని నిర్వహించారని,అయితే కాంగ్రెస్ మాత్రం వ్యక్తిగత కారణాలతో దీనిని నిర్వహిస్తోందని ధ్వజమెత్తారు.  పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషి అని గుజరాత్‌లోని సూరత్ కోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. అందువల్ల ఆయన లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యారని తెలిపారు.
 
కోర్టు తీర్పు ఫలితంగా ఆయనపై అనర్హత వేటు ఆటోమేటిక్‌గా పడిందని, అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆందోళన నిర్వహించడం నిస్సిగ్గుగా తమ దురహంకారాన్ని ప్రదర్శించడమేనని చెప్పారు. సత్యం కోసం జరిపే పోరాటంతో ఈ ఆందోళనకు సంబంధం లేదన్నారు. సరైన న్యాయ ప్రక్రియ జరిగిన తర్వాతే సూరత్ కోర్టు ఆయన దోషి అని తీర్పు చెప్పిందని తెలిపారు.
 
 సంబంధిత చట్టం ప్రకారం ఆటోమేటిక్‌గా ఆయన ఎంపీ పదవికి అనర్హుడయ్యారని చెప్పారు. అలాంటపుడు సత్యాగ్రహం దేనికోసమని ప్రశ్నించారు. దేశంలోని యావత్తు వెనుకబడిన వర్గాలవారిని అవమానించడాన్ని సమర్థించుకోవడానికా? శిక్ష విధించిన కోర్టుకు వ్యతిరేకంగానా? అనర్హత వేటు వేయాలని చెప్తున్న నిబంధనకు వ్యతిరేకంగానా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.