కెన‌డా హై క‌మిష‌న‌ర్ కు భారత స‌మ‌న్లు

ఖలిస్తానీ నిరసనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం కేంద్రం కెనడా హై కమిషనర్‌కి సమన్లు జారీ చేసింది.   మా దౌత్యవేత్తలు భద్రత కోసం కెనడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం, ఇలా అయితే వారు దౌత్యవిధులను ఏ విధంగా నిర్వర్తించగలరని ప్రశ్నించినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ఓ ప్రకటనలో వెల్లడించారు.
 
వియన్నా కన్వెన్షన్ కింద కెనడా తన బాధ్యతలను నెరవేర్చాలని కోరింది. భారత దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లపై దాడులకు దిగిన నేరస్థులను అరెస్ట్ చేసి, విచారించాలని డిమాండ్ చేసింది. అసలు ఈ తరహా కార్యకలాపాలకు ఎందుకు అనుమతించారు  పోలీసుల సమక్షంలో ఇలాంటి శక్తులను ఎలా అనుమతిస్తారని   కెనడాని ప్రశ్నించారు.
 
 పోలీసులు ఉన్నా భద్రతను ఎలా ఉల్లంఘిస్తారని పేర్కొంటూ దీనిపై వివరణ ఇవ్వాలని భారత ప్రభుత్వం కోరింది. అలాగే భారత  రాయబార కార్యాలయం వెలుపల భద్రతా ఏర్పాట్లపై భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్ వద్ద భద్రతకు భరోసానిచ్చేందుకు కావాల్సిన అన్ని చర్యలను కెనడా సర్కారు తీసుకుంటుందని భావిస్తున్నట్టు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
 
కాగా గత ఆదివారం ఖలిస్తాన్‌ మద్దతుదారుల ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో కెనడాలో భారత రాయబారి సంజరు కుమార్‌ వర్మ పాల్గొనాల్సిన  కార్యక్రమం రద్దు చేయబడింది.  నిరసనను రిపోర్ట్‌ చేస్తున్న జర్నలిస్ట్‌పై కూడా ఆందోళనకారులు దాడికి తెగబడ్డారు.  ప్రత్యేక ఖలిస్థాన్ అనుకూల వర్గాలు కెనడాలోని భారత దౌత్య మిషన్లు, కాన్సులేట్ల ముందు నిరసనకు దిగడం, దాడులకు పాల్పడడం పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.