నాలుగోసారి సీసీఎల్ విజేత‌గా తెలుగు వారియ‌ర్స్

 
సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్) 2023 విజేత‌గా తెలుగు వారియ‌ర్స్ టీమ్ నిలిచింది. సీసీఎల్‌లో అదిరిపోయే బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న తెలుగు వారియ‌ర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌, ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నాడు. శ‌నివారం జ‌రిగిన ఫైన‌ల్‌లో భోజ్‌పురి ద‌బాంగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజ‌యాన్ని సాధించిన తెలుగు వారియర్స్ నాలుగోసారి టైటిల్‌ను సొంతం చేసుకున్న‌ది.
ఫైన‌ల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భోజ్‌పురి ద‌బాంగ్స్ ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో ప‌ది ఓవ‌ర్ల‌లో 72 ర‌న్స్ మాత్ర‌మే చేసింది.  అఖిల్ అక్కినేని 32 బాల్స్‌లో 67 ర‌న్స్‌తో చెల‌రేగ‌డంతో తెలుగు వారియ‌ర్స్ ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 104 ర‌న్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో తెలుగు వారియ‌ర్స్‌కు భారీ ఆధిక్యం ల‌భించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భోజ్‌పురి ద‌బాంగ్స్ 89 ర‌న్స్ చేసింది. తెలుగు వారియ‌ర్స్ ముందు 58 ప‌రుగుల ల‌క్ష్యాన్ని విధించింది. ఈ సింపుల్ టార్గెట్‌ను మ‌రో నాలుగు ఓవ‌ర్లు మిగిలుండ‌గానే తెలుగు వారియ‌ర్స్ చేధించింది. ఎక్కువ టైటిల్స్ గెలిచిన టీమ్‌గా రికార్డ్ సృష్టించింది.

ఇంతకుముందు 2015, 2016, 2017లో వరుసగా గెలిచి తెలుగు వారియర్స్ హ్యట్రిక్ టైటిల్స్ సాధించింది. కాగా, అనంతరం కరోనా కారణంగా మూడేళ్లు విరామం వచ్చింది. కాగా.. ఈ లీగ్‌లో ఫైన‌ల్‌కి చేరేవరకు భోజ్‌పురి దబాంగ్స్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకపోవడం విశేషం. వైజాగ్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో అగ్ర హీరో వెంక‌టేష్‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ స్టార్స్ సంద‌డిచేశారు.