కుంకుమ పువ్వు సాగుకు ప్రోత్సాహం, చిరుధాన్యాలకు సహాయం

కృత్రిమ వాతావరణంలో కుంకుమ పువ్వు సాగును ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఒక యువ వ్యవసాయ పట్టభద్రురాలు ప్రయోగాత్మకంగా కుంకుమ పువ్వును సాగు మొదలుపెట్టి తొలి ప్రయత్నంలోనే స్వచ్ఛమైన 200 గ్రాముల ఫస్ట్‌ గ్రేడ్‌ దిగుబడి సాధించిన విషయం మీ దృష్టికి వచ్చిందా అని రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి  అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం వ్యవసాయంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసిన విద్యార్ధిని ఒకరు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తన ఇంట్లోనే హ్యుమిడిఫైర్స్‌ సాయంతో సెమి హైడ్రోపోనిక్స్‌ పరిస్థితులు సృష్టించి కుంకుమ పువ్వును సాగు చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు.  జమ్మూ, కాశ్మీర్‌లోని పంపోర్‌, పుల్వామా, బుడ్గాం, శ్రీనగర్‌ ప్రాంతాల్లో కుంకుమ పువ్వు సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున అక్కడ వాణిజ్య స్థాయిలో ఈ పంట సాగు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

సమశీతోష్ణ వాతావరణం, నీరు నిలవని వదులైన భూమి కుంకుమ పువ్వు సాగుకు అనువైన పరిస్థితులు కల్పిస్తాయని, భూమిలో పీహెచ్‌ విలువ 6.3 నుంచి 8.3 వరకు ఉండాలని, వాతావరణం ఎండా కాలంలో 23 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మధ్య శీతాకాలం అయింతే మైనస్‌ 15 డిగ్రీల నుంచి మైనస్‌ 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గకుండా ఉంటే మంచి నాణ్యమైన కుంకుమ పువ్వు దిగుబడి సాధించవచ్చని మంత్రి తెలిపారు.