ఆరు నెలల్లో ఇక టోల్ గేట్లు ఉండవు

జాతీయ రహదారులపై టోల్ ఫీజు వసూలుకు జీపీఎస్ ఆధారిత వ్యవస్థను వచ్చే ఆరు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలోనే వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీని వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం సహా ప్రయాణించిన దూరానికే టోల్ ఫీజు వసూలు చేసే వెసులుబాటు ఉంటుందని తెలిపారు.
 
ప్రస్తుతం టోల్ ఛార్జీల ద్వారా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ ఎ ఐ) ప్రతి ఏటా రూ.40 వేల కోట్లు ఆదాయం అందుకుంటోంది. ఇది మరో రెండుమూడేళ్లలో రూ.1.40 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు నితిన్ గడ్కరీ. వాహనాన్ని ఎక్కడా ఆపకుండానే నంబర్ ప్లేట్ ఆధారంగా ఛార్జీలు వసూలు చేసే విధానంపై ప్రస్తుతం రవాణా శాఖ పని చేస్తోందని చెప్పారు.
 
2018-19 సమయంలో టోల్  ఎ గేట్ల వద్ద ఒక్కో వాహనం సగటున 8 నిమిషాల పాటు ఆగాల్సి వచ్చేదని, ఫాస్టాగ్ విధానం అమలులోకి వచ్చాక ఆ సమయం 47 సెకన్లకు తగ్గిపోయిందని గుర్తు చేశారు మంత్రి. ఈ కొత్త జీపీఎస్ విధానం అమలులోకి వస్తే ఆ సమయం కూడా ఆగాల్సిన పని లేదని పేర్కొన్నారు.
 
ఇటీవల జమ్ముకశ్మీర్‌లో గుర్తించిన లిథియం నిల్వలను సమర్థవంతగా వినియోగించుకుంటే భారత్ ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలోనే తొలి స్థానానికి చేరుకుంటుందని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం ఏటా 1200 టన్నుల లిథియంను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. 2022లోనే జపాన్‌ను దాటి మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్ అవతరించిందని గుర్తు చేశారు.
 
ప్రస్తుతం లభించిన లిథియం నిల్వలను సమర్థంగా వినియోగిస్తే అగ్రరాజ్యం అమెరికా, చైనాలను సైతం దాటి అగ్రస్థానంలో నిలుస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో విద్యుత్ బస్సులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెబుతూ  ప్రజా రవాణాను ప్రోత్సహించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని  కేంద్ర మంత్రి తెలిపారు.