నాడు చించిన ఆర్డినెన్సే తోనే నేడు రాహుల్ కు ముప్పు

దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటుకు ఒకరకంగా గతంలో ఆయన తొందరపాటుతో చేసిన చేష్టలే కారణంగా స్పష్టం అవుతుంది. 2013లో సొంత ప్రభుత్వం యూపీఏ తీసుకువచ్చిన ఒక ఆర్డినెన్స్   ను రాహుల్ గాంధీ చించివేసి కలకలం రేపిన వార్తల్లో నిలవడం తెలిసిందే.

తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పట్ల తొందరపాటుతో  వ్యవహరించకుండా ఉంటె నేడు కోర్టులో జైలు శిక్ష పడిన వెంటనే లోక్ సభ సభ్యత్వానికి అనర్హత ముప్పు ఏర్పడేది కాదని పరిశీలకులు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ నాడు అనాలోచితంగా చేసిన ఆ చర్యే ఇప్పుడు ఆయనకు ముప్పుగా పరిణమించడం జరిగింది.

లిలి థామస్, లోక్ ప్రహారీ కేసుల్లో సుప్రీంకోర్టు వరుసగా 2013, 2018 లలో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సంబంధించి ఒక కీలక తీర్పును వెలువరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఒక సెక్షన్ ను ఆ తీర్పుల్లో సుప్రీంకోర్టు కొట్టివేసింది.
 
ఏదైనా క్రిమినల్ కేసులో 2 లేదా అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన ప్రజా ప్రతినిధికి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 సబ్ సెక్షన్ 4 ఒక వెసులుబాటు కల్పిస్తుంది. జైలు శిక్ష పడిన ఆ ప్రజా ప్రతినిధిని వెంటనే అనర్హుడిగా ప్రకటించకూడదని, అతడికి పై కోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి 3 నెలల సమయం ఇవ్వాలని, పై కోర్టు స్టే విధిస్తే అనర్హత నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఆ సెక్షన్ నిర్ధారిస్తుంది.
 
ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఆ సెక్షన్ 8(4 ను తన తీర్పుల్లో సుప్రీంకోర్టు  కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా 2013లో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధిని వెంటనే, తక్షణమే అనర్హుడిగా ప్రకటించకూడదని, అప్పీల్ కు సమయం ఇవ్వాలని, పై కోర్టు స్టే విధిస్తే, అనర్హత అంశంపై నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంది.
 
అంటే, దాదాపు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఆ సెక్షన్ 8(4) ను పునరుద్ధరిస్తూ ఆ ఆర్డినెన్స్ ను రూపొందించారు. ఆ ఆర్డినెన్స్ ను రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. అది అర్థం లేని ఆర్డినెన్స్ అని మండిపడ్డారు. ఒక ప్రెస్ మీట్ లో ఆ ఆర్డినెన్స్ పై తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ, ఆ ఆర్డినెన్స్  కాపీని చించేశారు.
 
ఇప్పుడు, ఆ ఆర్డినెన్స్ ను చించేసిన దాదాపు 10 సంవత్సరాల తర్వాత రాహుల్ గాంధీ తనే స్వయంగా అనర్హతకు గురి కావడం విశేషం. 2019లో కర్నాటకలో ఒక సభలో మాట్లాడుతూ, దేశాన్ని దోచుకుంటున్నవారికందరికీ మోదీ అనే ఇంటి పేరు ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు.  ఆ వ్యాఖ్యలపై  గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణ అనంతరం సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.