
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలాగే ఇన్‌ఫ్లుయెంజా సైతం ఆందోళనక కలిగిస్తున్నది ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి పవార్, ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, నీతి ఆయోగ్ సభ్యులు డా. వీకే పాల్, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, హౌం శాఖ కార్యదర్శి అజరు భల్లా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. కరోనా వైరస్ జన్యుపరివర్తనాలు, కొత్త వేరియంట్లను గుర్తించడంతో పాటు ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లోనూ వస్తున్న మార్పులు, ప్రజా సమాజంపై వాటి ప్రభావాలపై ప్రధాని తన సమీక్షలో ప్రధానంగా చర్చించారు. గత 2 వారాలుగా ఈ రెండు రకాల కేసులు పెరగడాన్ని నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు చెప్పారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచి వైరస్ కొత్త వేరియంట్లను గుర్తిస్తూ ఉండాలని, తద్వారా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడానికి వీలవుతుందని ప్రధాని మోదీ అధికారులకు చెప్పారు. అదే సమయంలో మాస్కులు ధరించడం వంటి కరోనా జాగ్రత్తలను ఆస్పత్రుల్లో అటు వైద్యులు, ఇటు రోగులు తప్పనిసరిగా పాటించాలని కూడా ఆయన సూచించారు.
అలాగే రద్దీ ప్రాంతాలను సందర్శించే వయోధికులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారు సైతం మాస్కులు ధరించాలని చెప్పారు. కరోనా కథ ఇంకా ముగియలేదని, అందరూ అందరూ అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన అవసరముందని ప్రధాని స్పష్టం చేశారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించడంతో పాటు ల్యాబ్ టెస్టింగ్ అనే ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్ధరించుకునేందుకు దవాఖానల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఏమైనా కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయేమో గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని చెప్పారు. మరోవైపు ప్రజలకు కూడా. బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలను పాటించాలని సూచించారు.
పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం ఒక్క రోజు 1,134 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 7,000కు చేరుకుంది. మఅతుల రేటు 1.19 శాతంగా నమోదైంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.98 శాతంగా ఉంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ గత వారం లేఖ రాసింది. స్థానికంగా కరోనా వ్యాప్తికి ఇది దారి తీయొచ్చని హెచ్చరించింది. కరోనా కట్టడికి తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.
More Stories
రక్షణ రంగంలో భారత్, అమెరికా పారిశ్రామిక సహకారం
జూన్ 11న సచిన్ పైలట్ సొంత పార్టీ ప్రకటన?
ముస్లింల మద్దతు కోసం బిజెపి ‘మోదీ మిత్రాస్’ ప్రచారం!