రాష్ట్రపతి నిలయం జనుల సందర్శనకు శ్రీకారం

హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంను సాధారణ ప్రజానీకం గతంలో మాదిరిగా జనవరిలో పక్షం రోజులు మాత్రమే కాకుండా సంవత్సరంలో ఎప్పుడైనా సందర్శించే సౌలభ్యాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీకారం చుట్టారు. ఈ సౌలభ్యం గురువారం నుండి అందుబాటులోకి వస్తున్నది.
 
ఇక్కడ జరిగిన ఉగాది ఉత్సవాలలో  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం వర్చువల్ గా పాల్గొని రాష్ట్ర పతి నిలయంలోని  నాలెడ్జి గ్యాలెరీ, కిచెన్ టన్నెల్ ను ప్రారంభించారు. వాటితో పాటు విజిటర్ ఫెసిలిటీస్ సెంటర్స్, పలు ఫౌండేషన్ స్టోన్స్, మెట్ల బావులను ప్రారంభించారు. గత నెలలో హైదరాబాద్ లోని రాష్ట్ర పతి నిలయంలో బస చేసే అవకాశం దొరికిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆనందం వ్యక్తం చేశారు.
 
 రాష్ట్రపతి నిలయం చరిత్రకు సంబంధించిన పూర్తి విషయాలు నాలెడ్జ్ గ్యాలరీలో లభిస్తాయని ఆమె తెలిపారు. రినోవెట్ చేసిన కిచెన్ టన్నెల్ ను తెలంగాణ సాంప్రదాయ కళతో నిర్మించామన్న ఆమె గతంలోనూ రాష్ట్రపతులు వివిధ గార్డెన్స్ ప్రారంభించారని ముర్ము తెలిపారు. ఇప్పుడు తన హయాంలో బట్టర్ ఫ్లై, రాక్, నక్షత గార్డెన్స్, స్టెప్ వెల్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రజలందరూ రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించండని రాష్ట్రపతి ఆహ్వానించారు.
 
దేశ ప్రజలకు గవర్నర్ డా. తమిళి సై సౌందరరాజన్ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్రపతి నిలయాన్ని గతంలో ప్రజల సందర్శనకు కేవలం 15 రోజులు మాత్రమే అనుమతించగా, ఇప్పుడు ఆ సమయాన్ని 11 నెలలకు పెంచడంపై రాష్ట్ర పతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.
 
కచ్చితంగా రాష్ట్రపతి నిలయం హైదరాబాదులోని పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు ప్రజలు ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తమిళిసై తెలిపారు.
 
దేశ ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి నిలయం హెరిటేజ్ బిల్డింగ్ అన్న కిషన్ రెడ్డి ఢిల్లీ తరహాలో మన హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలోనూ ప్రధాన మంత్రుల సమాచారం ఉండడం సంతోషమని చెప్పారు. హైదరాబాద్ లో అనేక పర్యాటక కేంద్రాలున్నాయని, అందులో రాష్ట్రపతి నిలయం ఒకటిగా చేరిందని తెలిపారు.
 
రాష్ట్రపతి కార్యకలాపాలు, రాష్ట్ర కార్యకలాపాలు పట్ల అవగాహన కలిగించే విధంగా ఈ రకమైన సందర్శనలు చాలా ఉపయోగపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.  హైదరాబాద్ ను సందర్శించే వారు కచ్చితంగా రాష్ట్రపతి నిలయం సందర్శించాలని ఆయన కోరారు. హోంమంత్రి మహమ్మద్ అలీ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారి కూడా పాల్గొన్నారు.