25న ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ‘‘నిరుద్యోగ మహా ధర్నా’’

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ‘‘మా నౌకరీలు మాగ్గావాలె’’ నినాదంతో ఈనెల 25న ఇందిరాపార్క్ వద్ద ‘‘నిరుద్యోగ మహా ధర్నా’’ చేపట్టాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే నిరుద్యోగ యువతతో కలిసి ఈ నిరుద్యోగ మహా ధర్నా నిర్వహించనుంది.
 
ఈరోజు మధ్యాహ్నాం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ, మీడియా సంస్థలపై దాడులు, జర్నలిస్టుల అరెస్ట్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నేపథ్యంలో 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున, వారికి మద్దతుగావ వివిధ రూపాల్లో పోరాట కార్యక్రమాలను రూపొందించేందుకు సిద్ధమయ్యారు.
 
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో సీఎం కేసీఆర్ కొడుకు పాత్ర ఉన్నందున వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని, ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో నిరుద్యోగ మహాధర్నా చేయాలని నిర్ణయించారు.
 
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళం విప్పుతూ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న మీడియా, సోషల్ మీడియా సంస్థలను, యూ ట్యూబ్ ఛానళ్లను బెదిరించడం, జర్నలిస్టులను అరెస్ట్ చేయడం వంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా సంస్థలు, జర్నలిస్టులకు అండగా నిలవడంతోపాటు వారి పక్షాన పోరాటం చేయాలని ఈ సందర్భంగా పార్టీ నిర్ణయించింది. 
 
అందులో భాగంగా ఆయా సంస్థల కార్యాలయాలకు వెళ్లి జర్నలిస్టులకు సంఘీభావంగా తెలపాలని నిర్ణయించారు. అందులో భాగంగా వివేక్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులతో బండి సంజయ్ బ్రుందాన్ని ఏర్పాటు చేశారు.

కాగా, సీఎం కేసీఆర్ కు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుతో సంబంధం ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని ఆయన చెప్పారు. పోలీసులు సైతం బీఆర్ఎస్ కార్యకర్తల్లా మారిపోయారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ ఉందని వివేక్ విమర్శించారు. కుట్రలో భాగంగానే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారని, ప్రశ్నించే  గొంతుకలను అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ పై బీజేపీ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.