రాహుల్ దేశ రాజకీయాల్లో నేటి కాలపు మీర్ జాఫర్

భారత దేశంపై చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేస్తూ రాహుల్ భారత దేశ రాజకీయాల్లో నేటి కాలపు మీర్ జాఫర్ అని బిజెపి ధ్వజమెత్తింది.  ఆయన ఎల్లప్పుడూ దేశాన్ని కించపరుస్తున్నారన్నరని, దేశాన్ని అవమానించారని, భారత దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని విదేశాలను కోరారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు. ఇది కాంగ్రెస్, రాహుల్ గాంధీ కుట్ర అని ఆరోపించారు.

‘రాహుల్ గాంధీ దేశాన్ని అవమానించారు, విదేశీ జోక్యాన్ని కోరారు. ఇదో సమస్య కాదని, ఇదో కుట్ర అని మేము భావిస్తున్నాము. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే. క్షమాపణలు కోరకుండా రాహుల్ గాంధీ తప్పించుకోలేరు. రాఫెల్ కేసులో, అలాగే కేంబ్రిడ్జ్‌లో చేసిన వ్యాఖ్యలకు పార్లమెంటులో రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే’ అని సంబిత్ పాత్ర తెలిపారు.

పార్లమెంటులో ఆయన భాగస్వామ్యం చాలా తక్కువ అని పేర్కొంటూ తనను ఎవరూ మాట్లాడనివ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు. మీర్ జాఫర్ చేసినదానికి ఇది భిన్నమైనదేమీ కాదని పేర్కొన్నారు.  తాను పరిపాలించాలనే కోరిక మీర్ జాఫర్‌కు ఉండేదని, ఆ కోరికను తీర్చుకోవడం కోసం ఈస్టిండియా కంపెనీ సహాయాన్ని పొందాడని, ఆ తర్వాత భారత దేశాన్ని బ్రిటిషర్లు పరిపాలించారని గుర్తు చేశారు.

‘రాహుల్ గాంధీ నేటి రాజకీయాల్లో మీర్ జాఫర్ వంటి వాడు. నవాబ్ కావడానికి మీర్ జాఫర్ ఏమి చేశాడో అలాగే రాహుల్ గాంధీ లండన్‌లో చేశారు. విదేశీ శక్తుల సహకారంతో యువరాజైన మీర్ జాఫర్ నవాబ్ కావాలనుకున్నాడు’ అని సంబిత్ పాత్ర తెలిపారు.చర్చ అనేది ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిదని చెప్పారు. 2019 నుంచి రాహుల్ గాంధీ చర్చల్లో పాల్గొనడం లేదని పేర్కొంటూ కేవలం ఆరు సార్లు మాత్రమే పార్లమెంటు చర్చల్లో పాల్గొన్నారని తెలిపారు.

‘‘దురదృష్టవశాత్తూ నేను ఎంపీని’’ అని రాహుల్ గాంధీ చెప్పడంపై కూడా సంబిత్ పాత్రా మండిపడ్డారు. రాహుల్ గాంధీకి ఏం మాట్లాడాలో తెలియదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ సహాయంతోనే ఆయన మాట్లాడతారని చెబుతూ ‘‘నేను దురదృష్టవశాత్తూ ఎంపీని’’ అని ఆయనే అంటున్నారు గదా అని ఎద్దేవా చేశారు.